Love Marriage | ఓ యువతిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో ఆమెను అప్పుడప్పుడు దొంగచాటుగా కలుసుకునేవాడు. అయితే ఓ అర్ధరాత్రి లవర్ ఇంటికి వెళ్లాడు ప్రియుడు. శబ్దం రావడంతో కుటుంబ సభ్యులకు మెలకువ వచ్చింది. వారి నుంచి తప్పింకునేందుకు స్థానికంగా ఉన్న ఓ బావిలో దూకేశాడు. అతడిని బావిలో నుంచి బయటకు తీసి పెళ్లి చేశారు పెద్దలు.
బీహార్ చాప్రా జిల్లాలోని మోతీరాజ్పూర్ వాసి మున్న రాజ్ గత కొంతకాలం నుంచి ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. పెళ్లి చేసుకునేందుకు సమయం ఉండటంతో అప్పుడప్పుడు వారు కలుసుకునేవారు. కానీ ఈ సారి దొంగచాటుగా కలుసుకునేందుకు యత్నించాడు ప్రియుడు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి 2 గంటలకు ప్రేయసి ఇంటికి వచ్చాడు.
ఆమె దగ్గరకు వెళ్లే సమయంలో ఎవరో ఇంట్లో తిరుగుతున్నట్లు శబ్దాలు వినిపించాయి. దీంతో కుటుంబ సభ్యులు నిద్ర లేచేసరికి, ప్రియుడు మున్నా పారిపోయాడు. గ్రామ సమీపంలోని బావిలో దూకేశాడు. అయినప్పటికీ అతన్ని ప్రేయసి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చుట్టుముట్టారు. బావిలో నుంచి బయటకు తీశారు గ్రామస్తులు. ఇక మరుసటి రోజు ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించారు గ్రామ పెద్దలు. అనంతరం స్థానిక ఆలయంలో మున్నాకు అతని ప్రేయసితో ఘనంగా వివాహం జరిపించారు.