ముంబై : రుణం తిరిగి చెల్లించలేదని మహిళ మార్ఫింగ్ వీడియోను ఆమె కజిన్‌కు పంపిన రికవరీ ఏజెంట్ (19)ను అంధేరిలో రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నాటకలో నిందితుడిని అరెస్ట్ చేసి ముంబైకి తరలించారు. మహిళ తాను తీసుకున్న రూ 9000 రుణం తీర్చకపోవడంతో రికవరీ ఏజెంట్ ఆమెను వేధించాడు.
మార్చి 4న బాధితురాలి కజిన్ అంధేరి నుంచి విలే పార్లేకు రైలులో ప్రయాణిస్తుండగా ఆమె వాట్సాప్‌కు గుర్తుతెలియని నెంబర్ నుంచి మార్ఫింగ్ చేసిన అశ్లీల వీడియోలు వచ్చాయి. తన కజిన్ ముఖం మార్ఫింగ్ చేసిన వీడియోలు చూసి ఆమె కంగుతింది. తన కజిన్ రుణం తీసుకుని చెల్లించలేదని, ఇప్పుడామె వ్యభిచారం చేస్తోందనే మెసేజ్ కూడా వచ్చింది. దీంతో ఆమె రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు ఆ నెంబర్‌ను ట్రేస్ చేయగా అది సీనియర్ సిటిజన్ పేరుతో తీసుకున్నట్టు వెల్లడైంది. పది శాతం కమిషన్‌తో లోన్ కంపెనీల రికవరీ ఏజెంట్‌గా పనిచేస్తున్న ఆయన మేనల్లుడు ఈ హ్యాండ్‌సెట్‌ను వాడుతున్నట్టు గుర్తించారు. లోన్ కంపెనీ డిఫాల్టర్ల డేటా అతడికి సమకూరుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.