చెన్నై : దళిత మహిళను బెదిరించి స్కూల్ విద్యార్ధులు సహా ఎనిమిది మంది నిందితులు ఆమెను నెలల తరబడి లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన తమిళనాడులోని విరుధ్‌నగర్‌లో కలకలం రేపింది. తన అభ్యంతరకర చిత్రాలను బహిర్గతం చేస్తామని బ్లాక్ మెయిల్ చేస్తూ వారు మహిళపై ఈ దురాగతానికి పాల్పడగా ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను అరెస్ట్ చేసిన ఘటనపై డీఎంకే ఎంపీ కనిమొళి స్పందిస్తూ వారు ఎంతటి వారైనా విడిచిపెట్టకుండా కఠిన చర్యలు చేపట్టాలని ట్వీట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధిత మహిళ గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా హరిహరన్ ఆమెను ప్రేమిస్తున్నానంటూ దగ్గరయ్యాడు. ఇద్దరి మధ్య పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. బాధితురాలిని హరిహరన్ గత ఏడాది ఆగస్ట్ 20న ఓ మెడికల్ గోడౌన్‌కు తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆపై ఆ దృశ్యాలను తన సెల్ఫోన్లో రికార్డు చేశాడు. ఇక ఆ వీడియోను హరిహరన్ తన స్నేహితులు ప్రవీణ్, జునైద్ అహ్మద్‌లతో పాటు 15 నుంచి 16 ఏండ్ల వయసున్న నలుగురు స్కూల్ విద్యార్ధులకు షేర్ చేశాడు.
ఏడుగురు నిందితులు సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేస్తామని బెదిరిస్తూ పలుమార్లు మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డారు. నిందితుల్లొ ఇద్దరు డీఎంకే కార్యకర్తలు కూడా ఉన్నారు. ఇక నిందితుల ఆగడాలను భరించలేని మహిళ సాయం కోరుతూ మదసమి అనే వ్యక్తిని ఆశ్రయించింది. ఇదే అదునుగా ఆమె ఫోన్ నుంచి వీడియోను రాబట్టిన మదసమి ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తన కోరిక తీర్చకపోతే వీడియోను ఆమె తల్లికి చూపుతానని బెదిరించాడు. నిందితుల తీరుతో విసిగిన బాధితురాలు విరుధ్‌నగర్ పోలీసులను ఆశ్రయించగా ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశారు.