లక్నో : యూపీలో మహిళలు, యువతులు, బాలికలపై హత్యాచారాలకు బ్రేక్ పడటం లేదు. తాజా ఘటనలో ఆమ్రోహ జిల్లాలోని ఖర్పారిలో వివాహిత (25) విగతజీవిగా నగ్నంగా రక్తపుమడుగులో పడిఉండటం కలకలం రేపింది. తన భార్యపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసి ఉంటారని మహిళ భర్త ఆరోపించారు. మహిళ మృతదేహం ఆమె ఇంట్లో గుర్తించిన అనంతరం గుర్తుతెలియని అనుమానితులపై పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.
పొలానికి నీరు పెట్టేందుకు భర్త వెళ్లిన సమయంలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. భర్త ధీర్ సింగ్ ఇంటికి తిరిగి వచ్చిన సమయంలో భార్య విగతజీవిగా పడిఉంది. ఆదంపూర్ పోలీస్ స్టేషన్లో భర్త పిర్యాదు చేశారు. బాధితురాలి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు.
మహిళ నగ్న మృతదేహం గుర్తించామని, ఆమె భర్త ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని స్ధానిక డీఎస్పీ సతీష్ చంద్ర పాండే తెలిపారు. మహిళ హత్యకు ముందు ఆమెపై లైంగిక దాడి జరిగిందా అనే విషయాలు పోస్ట్మార్టం నివేదికను పరిశీలించిన తర్వాతే వెల్లడవుతాయని చెప్పారు. నిందితులను త్వరలోనే పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు.