సూరత్ : గుజరాత్లో దారుణం చోటుచేసుకుంది. బనస్కంత జిల్లాలోని పంధవాడ గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో పనిచేసే మహిళా కూలీ కూతురు (14)పై యజమాని కుమారుడు (21) లైంగిక దాడికి పాల్పడ్డాడు. మైనర్ బాలిక తల్లి ఫిర్యాదు ఆధారంగా నిందితుడు సురేష్ పటేల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడి తండ్రికి చెందిన వ్యవసాయ క్షేత్రంలో బాలిక తల్లి పనిచేస్తోంది. కొద్దిరోజుల కిందట ఒంటరిగా కనిపించిన బాలికపై నిందితుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక అస్వస్ధతకు లోనుకావడంతో బుధవారం ఆస్పత్రికి తీసుకువెళ్లగా వైద్యులు గర్భవతిగా నిర్ధారించారు. దీంతో తల్లి బాలికను నిలదీయగా జరిగిన విషయం వెల్లడించింది. బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడు పటేల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితుడిపై పోక్సో , ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మరోవైపు యూపీలోని బిజ్నోర్ జిల్లాలో ఇటీవల ఆరేండ్ల బాలిక
స్కూల్‌కు వెళుతుండగా అడ్డగించిన నిందితుడు (26) ఆమెను నిర్జన ప్రదేశంలోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడటం కలకలం రేపింది. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.