HighTech Cheating | పరీక్షల్లో కాపీలు కొట్టడం మనకు తెలుసు. స్కూలు, ఒక్కోసారి కాలేజ్ పరీక్షల్లో కాపీలు కొట్టడం చూస్తుంటాం. సినిమాల్లో కామెడీ కోసం హైటెక్ చీటింగ్ చేయడం కూడా మనకు తెలుసు. కానీ పోటీ పరీక్షల్లో చాలా స్ట్రిక్ట్‌గా సెక్యూరిటీ ఉంటుంది. వీటిలో కాపీ కొట్టడం అంత ఈజీ కాదు.
అలాంటిది పోలీసు ఎస్ఐ పరీక్షల్లో ఒక అభ్యర్థి హైటెక్‌గా కాపీ కొట్టేందుకు ప్రయత్నించాడు. దీనికోసం పూర్తి ప్లాన్ వేసుకొని ఎగ్జామ్ హాల్‌కు వెళ్లాడు. అయితే అతని చెవిలో చాలా చిన్న ఇయర్‌ఫోన్ ఉండటాన్ని పరీక్ష కేంద్రం వద్ద కాపలా ఉన్న పోలీసులు గుర్తించారు.
అంతేకాదు, తమ ముందున్న వ్యక్తి తలపై ఉన్న జుట్టులో కూడా తేడా ఉండటాన్ని గమనించారు. తీరా చూస్తే అతను విగ్ పెట్టుకొచ్చినట్లు తేలింది. ఈ హైటెక్ టెక్నిక్‌ను పట్టుకొన్న అధికారులు ఈ తతంగం మొత్తాన్ని వీడియో తీశారు.
దీన్ని తాజాగా ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ సోషల్ మీడియాలో షేర్ చేశారు. యూపీ పోలీసులను ఆయన అభినందించారు. కొన్ని నెలల క్రితం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే సోషల్ మీడియాలో ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.