రామగుండం : గుంజపడుగు ఎస్బీఐ బ్యాంకు చోరీ కేసులో పోలీసులు తాజాగా ముఠాలోని ఓ సభ్యుడిని అరెస్టు చేశారు. చోరీ సొత్తులోని సుమారు 20 తులాల బంగారాన్ని రికవరీ చేశారు. గడిచిన మార్చి 24వ తేదీ రాత్రి గ్యాస్ సిలిండర్, గ్యాస్ కట్టర్ సహాయంతో చోరీ ముఠా బ్యాంకు సేఫ్టీ లాకర్‌ను తెరిచి 6 కిలోల బంగారం ఆభరణాలు, రూ.18 లక్షల నగదు అపహరించుకుపోయారు. బ్యాంకు మేనేజర్ ప్రహ్లాద్ పింగ్వ పిర్యాదు మేరకు మంథని పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గోదావరిఖని ఏసీపీ ఉమేందర్ నేతృత్వంలోని బృందాలు దర్యాప్తు చేపట్టాయి.
నేర విదానాన్ని పరిశీలించి ఇది ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర గ్యాంగ్ పనే అని పోలీసులు నిర్దారణకు వచ్చారు. ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. మహారాష్ట్ర పోలీసుల ఆధీనంలో ఉన్న దొంగలను విచారించగా మొత్తం 9 మంది ముఠా సభ్యులు ఈ దొంగతనానికి పాల్పడ్డట్లు తేలింది. వీరిలో ఇంకా నలుగురు పరారీలో ఉన్నారని తెలిసింది. సమాచారం మేరకు దొంగల ముఠాలోని ఒక సభ్యుడు ఆదేశ్ శర్మను ఉత్తరప్రదేశ్ లో పట్టుకున్నారు. ట్రాన్సిట్ ఆరెంట్పై నిందితుడిని మంథనికి తీసుకువచ్చారు.
మహారాష్ట్ర పోలీసుల అదుపులో ఉన్న నిందితుల వివరాలిలా ఉన్నాయి. నవాబుల్ హసన్(యూపీ), దాన్వీర్(యూపీ), రాజు వసంతరావు(మహారాష్ట్ర), దేవదాస్ రూప్ చాంద్ కప్గాటే(మహారాష్ట్ర), సాకేత్ తేజ్ రామ్ ఉర్కే(మహారాష్ట్ర). పరారీలో ఉన్న నిందితుల వివరాలు.. నవాబ్(యూపీ), నాసర్ అలీ(యూపీ), జహంగీర్(యూపీ).
కేసు చేదనలో, నిందితులను పట్టుకోవడానికి ఏర్పాటు చేసిన వివిధ దర్యాప్తు బృందాలకు నాయకత్వం వహించడంతో పాటు, సాంకేతిక విశ్లేషణ, పలుమార్లు ఉత్తరప్రదేశ్ లోని పలు ప్రాంతాలపై నిందితులను పట్టుకోవడం కోసం రైడింగ్ లు చేయడంలో కీలకపాత్ర వహించిన రామగుండం ఓఎస్డీ శరత్ చంద్ర పవర్‌కి సీపీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. అదేవిధంగా ఈ కేసును చేదించి నిందితులను పట్టుకోవడానికి కృషి చేసిన దర్యాప్తు అధికారి గోదావరిఖని ఏసీపీ వి.ఉమేందర్, ఉత్తరప్రదేశ్ వెళ్లి నెల రోజులు కష్టపడి నిందితున్ని పట్టుకున్న పోలీస్ బృందాన్ని సీపీ అభినందిచారు.