భోపాల్ : పద్నాలుగేండ్ల బాలికను బెదిరించి ఆమె బంధువు లైంగిక దాడికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని ఐష్బాగ్లో ఆలస్యంగా వెలుగుచూసింది. ఏడాది కిందట ఈ ఘటన జరగ్గా నిందితుడు మరోసారి లైంగిక దాడికి ప్రయత్నించడంతో బాలిక కుటుంబసభ్యులకు చెప్పడంతో ఈ దారుణం బయటపడింది. కుటుంబసభ్యులతో కలిసి బాలిక శనివారం ఐష్ బాగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై పోక్సో సహా పలు చట్టాల కింద కేసు నమోదు చేశారు.
ఖండ్వాకు చెందిన నిందితుడు ఉద్యోగం కోసం గత ఏడాది ఏప్రిల్లో బాధితురాలి ఇంటికి వచ్చాడు. నిందితుడి ప్రవర్తన గురించి తెలియని బాలిక కుటుంబ సభ్యులు తమ ఇంట్లోనే అతడికి ఆశ్రయం ఇచ్చారు. ఇక బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెను బెదిరించిన నిందితుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించడంతో మౌనంగా ఉంది.
ఇక ఇటీవల మళ్లీ తన కోరిక తీర్చాలని నిందితుడు పదేపదే వేధిస్తుండటంతో ధైర్యం కూడదీసుకుని బాలిక జరిగిన విషయం కుటుంబ సభ్యలకు తెలిపింది. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని దర్యాప్తు అధికారి, ఎస్ఐ సోమేష్ తోమర్ చెప్పారు.