అహ్మదాబాద్ : గుజరాత్లో దారుణ ఘటన వెలుగుచూసింది. దివ్యాంగురాలిని బెదిరించి నలుగురు వ్యక్తులు పలుమార్లు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
రాజస్ధాన్ నుంచి వలసవచ్చిన బాధితురాలి (22)పై నిందితులు దారుణానికి తెగబడగా గ్రామాన్ని విడిచిన ఆమె తన స్వస్ధలం నుంచి పిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా నిందితులపై గురువారం జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మెహసనా సమీపంలోని గ్రామంలో మహిళపై నలుగురు వ్యక్తులు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడగా బాధితురాలి మైనర్ కుమారుడు ఈ దారుణం గురించి తండ్రికి చెప్పడంతో విషయం బయటకు వచ్చింది. మహిళ భర్త ఈ విషయమై నిందితులను నిలదీయగా బాధితురాలి కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించడంతో వారు మెహసనా నుంచి రాజస్ధాన్కు తిరిగివచ్చారని పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.