Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ నగర శివార్లలోని గండిపేటలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న యూనియన్ బ్యాంకు బిల్డింగ్‌లోని నాలుగో అంతస్తులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ అంతస్తులోని ల్యాప్‌టాప్ ప్యాకింగ్ కార్యాలయంలో ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించింది. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది.
బ్యాంక్‌కు ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. బిల్డింగ్ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ కమ్ముకుంది. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అగ్నికీలలు ఎగిసిపడ్డ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు దగ్ధమైనట్లు తెలిపారు. షాట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.