గురుగ్రాం : అప్పుల బాధతో డబ్బు కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న వ్యక్తి తాను పనిచేసే సంస్ధలో బంగారాన్ని దొంగిలించి పట్టుబడకుండా ఉండేందుకు దాన్ని మింగిన ఘటన గురుగ్రాంలోని మనేసర్‌లో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మనేసర్‌లోని మెటల్ రిఫైనరీలో పనిచేసే వ్యక్తి కంపెనీలో బంగారాన్ని తస్కరించి దాన్ని విక్రయించడం ద్వారా అప్పు తీర్చాలని స్కెచ్ వేశాడు. నవంబర్ 11న సాయంత్రం 5.30 గంటలకు నిందితుడు సుబ్రత బర్మన్ ఈ ఘటనకు పాల్పడ్డాడు.
ఆరోజు సాయంత్రం రోజూలాగానే ఇంటికి వెళుతుండగా మెటల్ డిటెక్టర్‌పై బీఫ్ సౌండ్ రావడంతో సెక్యూరిటీ గార్డుకు అనుమానం వచ్చి చెక్ చేసినా బంగారం పట్టుబడలేదు. దీంతో సిబ్బంది అతడిని సమీప ఆస్పత్రికి తీసుకెళ్లగా అతడి పొట్టలో లోహం ఉన్నట్టు రిపోర్ట్‌లో బయటపడింది. అప్పులు తీర్చేందుకు తాను డబ్బు అవసరం కాగా 1.6 గ్రాముల బంగారాన్ని దొంగిలించానని బర్మన్ అంగీకరించాడు. కంపెనీ మేనేజర్ ఫిర్యాదుతో నిందితుడు బర్మన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.