బెంగళూరు: తల్లితో మాట్లాడనీయకుండా, ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పనీయకుండా విద్యార్థిని స్కూల్ నిరోధించింది. దీంతో మనస్తాపం చెందిన ఆ స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. కర్ణాటకలోని మంగళూరులో ఈ సంఘటన జరిగింది. బెంగళూరులోని హోసాకోట్కు చెందిన రమేశ్, మంజుల దంపతులు తమ 14 ఏళ్ల కుమారుడు పూర్వజ్ను మంగళూరు శివారు ప్రాంతమైన తాళ్లపాడు దేవినగర్లోని శారద విద్యానికేతన్ స్కూల్లో చదివిస్తున్నారు. 9వ తరగతి చదువుతున్న ఆ విద్యార్థి అక్కడి హాస్టల్లోనే ఉంటున్నాడు.
అయితే ఆ స్టూడెంట్ తన తల్లితో ఫోన్లో మాట్లాడేందుకు ఆ స్కూల్ యాజమాన్యం నిరోధించింది. దీంతో తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు కూడా అతడు చెప్పలేకపోయాడు. ఈ నేపథ్యంలో మనస్తాపం చెందిన పూర్వజ్, ఈ నెల 11న అర్ధరాత్రి వేళ తన హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అదే రూమ్లో ఉన్న మరో విద్యార్థి గమనించి హాస్టల్ సిబ్బందికి ఈ విషయం చెప్పాడు.
మరోవైపు తమ కుమారుడి మరణవార్త తెలుసుకున్న పూర్వజ్ తల్లిదండ్రులు వెంటనే ఆ స్కూల్ వద్దకు వెళ్లారు. చిన్న చిన్న విషయాలకే తమ కుమారుడ్ని వేధించారని, తమతో మాట్లాడనీయలేదని ఆరోపించారు. దీంతో తమ కుమారుడు ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకున్నాడని, స్కూల్ హెడ్ మాస్టార్, హాస్టల్ వార్డెన్ దీనికి బాధ్యులంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.