న్యూఢిల్లీ : ఓ ఎంబీఏ విద్యార్థిని ఇద్దరు కిడ్నాప్ చేసి.. తుపాకీతో బెదిరించి నగ్నంగా వీడియో చిత్రీకరించారు. ఆ వీడియోను అడ్డు పెట్టుకుని సదరు విద్యార్థి నుంచి రూ. 20 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన ఢిల్లీలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఓ ఎంబీఏ విద్యార్థి తన కుటుంబంతో కలిసి ఢిల్లీలో నివసిస్తున్నాడు. అయితే ఓ ఇద్దరు వ్యక్తులు ఆ విద్యార్థితో పరిచయం పెంచుకున్నారు. 2020, అక్టోబర్ 23వ తేదీన విద్యార్థిని తమ గదికి తీసుకెళ్లారు ఆ ఇద్దరు వ్యక్తులు. అక్కడ తుపాకీతో బెదిరించి నగ్నంగా వీడియో చిత్రీకరించారు. బలవంతంగా గంజాయి సేవించేలా చేశారు. దీన్ని కూడా వీడియో తీశారు. ఇక ఈ రెండు వీడియోలను అడ్డు పెట్టుకున్న ఆ ఇద్దరు విద్యార్థిని బెదిరిస్తూ రూ. 20 లక్షలు డిమాండ్ చేశారు. తాము అడిగిన డబ్బు ఇవ్వకపోతే తప్పుడు కేసులు నమోదు చేస్తామని, న్యూడ్ వీడియోలను బయటపెడుతామని బెదిరింపులకు పాల్పడ్డారు.
ఈ క్రమంలో బాధిత విద్యార్థి కుటుంబం రూ. 5 లక్షలు ఇచ్చింది. అయినప్పటికీ విద్యార్థి నగ్న వీడియోలను వారి బంధువులకు, కాలనీవాసులకు షేర్ చేశారు. మిగతా డబ్బులు ఇవ్వకపోతే ఎంబీఏ విద్యార్థితో పాటు అతని కుటుంబాన్ని చంపేస్తామని ఆ ఇద్దరు దుండగులు ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన బెదరించారు.
దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ధర్మపాల్ అనే కానిస్టేబుల్ ఆ ఫిర్యాదును తిరస్కరించి.. బెదిరించాడు. తీవ్ర మనస్తాపానికి గురైన బాధితుడు ఫినైల్ తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనను గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.
మొత్తానికి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొకరి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఫిర్యాదును తిరస్కరించిన కానిస్టేబుల్‌పై కూడా తగిన చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.