
న్యూఢిల్లీ: తల్లిని దూషించిన సీనియర్ను జూనియర్ విద్యార్థి హత్య చేశాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. ఓఖ్లాలోని తెహఖండ్ ప్రభుత్వ పాఠశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఒక స్టూడెంట్, పదో తరగతి చదువుతున్న మరో విద్యార్థి మధ్య కొన్ని రోజుల కిందట ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా జూనియర్ విద్యార్థి తల్లి పట్ల సీనియర్ విద్యార్థి అసభ్యంగా మాట్లాడాడు. దీనిపై క్షమాపణలు చెప్పాలని సీనియర్ను జూనియర్ డిమాండ్ చేశాడు. సీనియర్ క్షమాపణ చెప్పకపోవడంతో అతడ్ని చంపాలని జూనియర్ స్టూడెంట్ డిసైడ్ అయ్యాడు.
శుక్రవారం స్కూల్ బయట ఇంటర్ విద్యార్థిపై పదో తరగతి విద్యార్థి దాడి చేశాడు. అతడ్ని కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆ సమయంలో వీరిద్దరు స్కూల్ డ్రెస్లోనే ఉన్నారు. సీనియర్ స్టూడెంట్ను ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు చెప్పారు.
సమాచారం అందుకున్న పోలీసులు పోలీసులు జూనియర్ స్టూడెంట్ను అరెస్ట్ చేశారు. తన తల్లిని దూషించిన కారణంతోనే సీనియర్ను చంపినట్లు పదో తరగతి విద్యార్థి పోలీసులకు చెప్పాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.