హైదరాబాద్ : చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డ డ్యాన్స్ మాస్టర్‌ను నగరంలోని ఎస్.ఆర్.నగర్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుడిని సీహెచ్. వినోద్(27) గా గుర్తించారు. నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి నివాసి. నగరంలోని మధురా నగర్ ప్రాంతంలో మెన్స్ హాస్టల్లో ఉంటూ స్థానికంగా డ్యాన్స్ అకాడమీని నిర్వహిస్తున్నాడు. కాగా కరోనా సంక్షోభం కారణంగా గత ఏడాదిగా ఉపాధి లేకుండా ఉంది. ఇతర ఉద్యోగాలు దక్కించుకోవడంలో విఫలమయ్యాడు. స్నేహితుల వద్ద అప్పులు చేశాడు. వాటిని తిరిగి చెల్లించేందుకు చైన్ స్నాచింగ్ చేసేందుకు నిశ్చయించుకున్నాడు. ప్లాన్ ప్రకారం మధురా నగర్ మెట్రో స్టేషన్ వద్ద ఓ సాఫ్ట్వేర్ మహిళను లక్ష్యంగా చేసుకున్నాడు. అనుకున్న విధంగానే ఆమె బంగారు చైన్‌ను శుక్రవారం అపహరించాడు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు ఎస్.ఆర్.నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు.