Crime News | ఐదురోజులుగా తమ కుమార్తె కనిపించడం లేదని ఒక కుటుంబం చాలా బాధపడుతోంది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె కోసం గాలింపు చర్యలు తీవ్రంగా జరుగుతున్నాయి. కానీ ఎటువంటి ఆచూకీ దొరకలేదు. అలాంటిది సడెన్‌గా ఒక వ్యక్తి ఫోన్ చేసి, ఆ యువతి మృతదేహం ఎక్కడుందో చెప్పాడు.
దీంతో వణికిపోయిన ఆ తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఈ విషయం తెలియజేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమెను హత్య చేసిన వ్యక్తి కోసం దర్యాప్తు చేయగా.. కీలకాంశాలు వెలుగు చూశాయి. ఈ ఘటన హర్యానాలోని ఫరీదాబాద్‌లో వెలుగు చూసింది.
స్థానికంగా ఒక ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న సింగరాజ్ (54) అనే వ్యక్తి ఈ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. సదరు యువతి (21) మార్కెట్లో ఉండగా ఆమెకు ఫోన్ చేసిన సింగరాజ్ తనను కలవాల్సిందిగా కోరాడు. అతన్ని కలవడానికి వచ్చిన యువతిని గొంతు పిసికి చంపేశాడు. ఆపై ఆమె మృతదేహాన్ని రోడ్డు పక్కన ఉన్న పొదల్లో పడేసి వెళ్లిపోయాడు.
ఆ సమయంలో యువతి మొబైల్ కూడా పట్టుకెళ్లాడు. ఈ ఘటన గత డిసెంబరు 31న జరిగింది. అప్పటి నుంచి సదరు యువతి కోసం ఆమె కుటుంబం గాలిస్తోంది. తాజాగా వారికి ఫోన్ చేసిన సింగరాజ్.. మృతదేహం ఎక్కడ ఉందీ చెప్పాడు. దీంతో జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది.