అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ టోనీకి 14 రోజుల రిమాండ్ విధించారు. డ్రగ్స్ కేసులో గురువారం నాడు టోనీ సహా 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులను పోలీసులు.. నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఇప్పుడు వీరందరికీ 14 రోజులపాటు రిమాండ్ విధించడంతో.. అందర్నీ చంచల్ గూడ జైలుకు తరలించారు.
డ్రగ్స్ అమ్మేందుకు ప్రతి 15 రోజులకు ఒకసారి ముంబై నుంచి టోనీ ఒక బ్యాచ్‌ను హైదరాబాద్ పంపినట్లు తెలుస్తోంది. హైదరాబాదులోని ఓయో రూమ్ లో మకాం వేసిన వ్యాపారవేత్తలకు ఈ బ్యాచ్ వాళ్లు డ్రగ్స్ అమ్మేవారు. టోనీకి నమ్మకం ఉన్న 60 మంది యువకుల చేత డ్రగ్స్ వ్యాపారం చేయిస్తూ వచ్చినట్లు సమాచారం. పోలీసులకు చిక్కకుండా కొత్త కొత్త పంథాలో డ్రగ్స్‌ను హైదరాబాద్ తీసుకొని వచ్చేదీ బ్యాచ్.
వ్యాపారవేత్తలకు ఒక గ్రామ్ కోకైన్ను రూ.20 వేల చొప్పున అమ్మేవారు. అరెస్టయిన వ్యాపారవేత్తలు ప్రతిసారీ పెద్దమొత్తంలో డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. గత నాలుగు సంవత్సరాల నుంచి టోనీ దగ్గర్నుంచి ఈ వ్యాపారులు డ్రగ్స్ కొంటున్నారు. వీరిలో నిరంజన్ జైన్ అనే వ్యాపారి ఇప్పటి వరకూ కనీసం 30 సార్లు టోనీ దగ్గర్నుంచి డ్రగ్స్ తెప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు.
వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ డ్రగ్స్‌కు అలవాటు పడ్డ నిరంజన్ జైన్.. పలు ప్రభుత్వ ప్రాజెక్టు పనులకు కూడా కాంట్రాక్టులు తీసుకున్నట్లు తెలుస్తోంది. పాత బస్తీ కేంద్రంగా నడుస్తున్న మసాలా దినుసుల ఫ్యాక్టరీ ఎండీ కూడా ఈ కేసులో అరెస్టయ్యాడు. మసాలా దినుసులతో ప్రతి ఏడాది వందల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న ఆనంద్ అనే వ్యక్తి.. మూడు సంవత్సరాల నుంచి టోనీ గ్యాంగ్ దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నాడు.
వీరితోపాటు ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి శాశవత్ జైన్ కూడా ఈ వ్యాపారుల్లో ఒకడు. హైదరాబాదుతో పాటు ఆంధ్రాలో పెద్ద ఎత్తున రియల్ వ్యాపారాలు చేస్తున్న శాశవత్ జైన్.. శంషాబాద్‌లోని వందల ఎకరాల్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు. ప్రముఖ కాంట్రాక్టర్ దండు సూర్య సుమంత్ రెడ్డి, ప్రముఖ వ్యాపారి బండి భార్గవ్, ప్రముఖ ఎగుమతి-దితుమతుల వ్యాపారి వెంకట్ చలసాని, వ్యాపారవేత్త తమ్మినేద సాగర్ కూడా డ్రగ్స్ ముఠాలో ఉన్నారు.
భార్గవ్, వెంకట్ కలిసి పార్టనర్స్‌గా ఎగుమతుల వ్యాపారం చేసేవారు. వీళ్లిద్దరూ హైదరాబాద్‌లోని అంతర్జాతీయ స్కూల్లో చదువుకున్నారు. వెంకట్ చలసాని తండ్రి కూడా పెద్ద కాంట్రాక్టరే. వీళ్లందరూ కలిసి ముంబై డ్రగ్ మాఫియా డాన్ టోనీతో సంబంధం పెట్టుకున్నారు. అతని నుంచి నిత్యం డ్రగ్స్ తెప్పించుకునేవారని తెలుస్తోంది.