చెన్నై: దివ్యాంగ కుమారుడ్ని హత్య చేసిన దంపతులు, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ విషాదకర ఘటన జరిగింది. స్థిరాస్తి వ్యాపారి అయిన 44 ఏండ్ల మహ్మద్ సలీం, భార్య సోఫియాతో కలిసి అవడి ప్రాంతంలోని అశోక్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. వారి కుమారుడు 14 ఏండ్ల అబ్దుల్ సలీం దివ్యాంగుడు. మూగ, చెవిటి సమస్యతో బాధపడుతున్న కుమారుడ్ని పలువురి వైద్యులకు చూపించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో మనస్థాపానికి గురైన ఆ దంపతులు తమ జీవితాలను ముగించాలని నిర్ణయించారు. శుక్రవారం తెల్లవారుజామున తొలుత దివ్యాంగ కుమారుడ్ని ఉరి వేసి చంపారు. అనంతరం భార్యభర్తలు కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
అయితే, ఆత్మహత్యకు ముందు మహ్మద్ సలీం ఈ కఠిన నిర్ణయం గురించి శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటలకు తన సోదరి సలీమాకు మెసేజ్ పంపారు. తమ మరణాలకు ఎవరూ కారణం కాదని అందులో పేర్కొన్నారు. తన ఆస్తిని సోదరి, ఆమె పిల్లలకు ఇవ్వాలని పోలీసులను అందులో కోరారు.
మరోవైపు నిద్రలేచిన తర్వాత ఉదయం 7 గంటలకు ఈ మెసేజ్‌ను సోదరి సలీమా చూసింది. వెంటనే సోదరుడి ఇంటికి వెళ్లి చూడగా కుటుంబంలోని ముగ్గురు కూడా ఉరికి వేలాడుతూ విగతజీవులుగా కనిపించారు. దీంతో ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం కిల్పాక్ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.