పాట్నా: కొందరు వ్యక్తులు పోలీసులను వెంబడించి దారుణంగా కొట్టారు. బీహార్ రాజధాని పాట్నాలో ఈ సంఘటన జరిగింది. గురువారం పాట్నా మార్కెట్ సమీపంలో కొందరు అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నారంటూ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పిర్బహోర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మసీదు వద్దకు పోలీస్ బృందాలు వెళ్లాయి. నలుగురు వ్యక్తులను సోదా చేశారు. వారిని నిర్బంధించి పోలీస్ స్టేషన్‌కు తరలించసాగారు.
ఇంతలో కొందరు వ్యక్తులు ఆ పోలీసులను చుట్టుముట్టారు. పోలీసులపై దాడి చేశారు. పరుగులు తీస్తున్న పోలీసులను వెంబడించి మరీ కొట్టారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న నలుగురు యువకులను విడిపించారు. అనంతరం స్థానికులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ వద్ద గుమిగూడారు. సివిల్ డ్రెస్‌లో వచ్చిన పోలీసులు తప్పుడు సమాచారంతో నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని వేధించారని ఆరోపించారు. సుమారు అర గంట పాటు ఆ పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగారు.
మరోవైపు స్థానికుల దాడిలో కొందరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని పాట్నా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులపై దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. నిందితులను గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.