కాన్పూర్ : యూపీలో మహిళలు, చిన్నారులపై లైంగిక దాడుల ఘటనలు కొనసాగుతున్నాయి. లైంగిక దాడి ఘటనలో బాధితురాలు బలవన్మరణానికి యత్నించగా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసిన ఉదంతం బందా జిల్లాలో వెలుగుచూసింది. తన ఫ్రెండ్ సోదరుడే తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని యువతి ఆరోపిస్తోంది. మార్చి 25న ఇంట్లో ఎవరూ లేని సమయంలో తనను పిలిపించి బలవంతంగా లైంగిక దాడికి తెగబడ్డాడని, ఆపై ఆ దృశ్యాలను వీడియోలో రికార్డు చేశాడని తెలిపింది.
వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించి పలుమార్లు లైంగిక దాడి చేశాడని ఆమె పేర్కొంది. నిందితుడి తీరుతో విసిగిపోయి సోమవారం ఉరివేసుకుని తనువు చాలించాలని ఆమె బలవన్మరణానికి పాల్పడగా కుటుంబ సభ్యులు కాపాడి దవాఖానకు తరలించారు. నిందితుడు తనపై దారుణానికి ఒడిగట్టిన తీరును ఆమె కుటుంబ సభ్యులకు వివరించగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి స్టేట్మెంట్ను రికార్డు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.