గోల్నాక : అనుమానస్పదస్థితిలో ఓ కానిస్టేబుల్ మృతి చెందిన విషాద ఘటన అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై సాల్వేరు మల్లేశం తెలిపిన వివరాల ప్రకారం..వరంగల్‌కు చెందిన జి.కృష్ణకాంత్ (27) అంబర్‌పేట తురాబ్‌నగర్‌లో అతని బ్యాచ్‌మేట్ జె.శ్రీకాంత్‌రెడ్డితో కలసి అద్దె ఇంట్లో నివాసముంటూ కార్ హెడ్ క్వార్టర్స్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
సోమవారం మధ్యాహ్నం 12గంటలకు కృష్ణకాంత్ తన స్నేహితుడితో కలసి అల్పాహారం చేశాడు. అనంతరం కృష్ణకాంత్ ఇంట్లోనే ఉండగా అతని స్నేహితుడు శ్రీకాంత్‌రెడ్డి కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడానికి అంబర్‌పేట సీపీఎల్ దవఖానాకు వెళ్లా డు. వ్యాక్సిన్ తీసుకొని తిరిగి మధ్యాహ్నం 2.45 సమయంతో ఇంటికి రాగా అతని స్నేహితుడు కృష్ణకాంత్ యూనిఫాం లో అచేతనంగా పడి ఉన్నాడు.
వెంటనే చికిత్స నిమిత్తం దగ్గరలోని ట్రైకలర్ దవఖానాకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాధిత మృతుడి స్నేహితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.