శేరిలింగంపల్లి : మద్యంమత్తులో ఓ బార్లో జరిగిన చిన్నపాటి గొడవ ఓ వ్యక్తిపై హత్యాయత్నానికి దారితీసింది. ఇరువర్గాల మధ్య పరస్పరం వాగ్వివాదం చోటుచేసుకొని సోడా బాటిల్‌తో దాడికి పాల్పడడంతో ఓ వ్యక్తికి భుజం, మెడ బాగంలో గాయాలైన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…
కొండాపూర్ గోపాల్‌రెడ్డి నగర్‌లోని ఆర్టీఏ కార్యాలయం ఎదురుగా కనిష్క్బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. హాపీజ్పేట్కు చెందిన పాతనేరస్థుడు హాబీబ్ తన ఇద్దరు స్నేహితులు శైలేష్, పరమానంద్ యాదవ్‌లతో కలిసి మధ్యాహ్నం నుంచి బార్లో మద్యం సేవిస్తున్నాడు. కాగా సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మియాపూర్‌కు చెందిన ఆటోడ్రైవర్ తుకారాం తన ముగ్గు రు స్నేహితులతో కలిసి బార్‌కు వచ్చి హాబీబ్ అతని స్నేహితులు కుర్చున పక్క టేబుల్లో కుర్చుని మద్యం సేవించారు.
కాసేపటికి ఇరువర్గాల మద్య చిన్నపాటి వాగ్వివాదం చోటుచేసుకోగా హాబీబ్ సోడా బాటిల్ పగలగొట్టి తుకారంపై దాడికి పాల్పడ్డాడు. తుకారం మెడ, భుజాలపై గాయాలు కావడంతో స్నేహితులు అతన్ని స్థానికంగా ఉన్న ఓ ప్రవేట్ హాస్పటల్ కు తరలించారు.
బాధితులు, బార్ అండ్ రెస్టారెంట్ సిబ్బంది సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గొడవకు కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. దాడికి పాల్పడ్డ హాబీబ్ అక్కడి నుంచి పారిపోగా, అతడి అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకొని హాబీబ్ కోసం గాలిస్తున్నారు.