చెన్నై: ఒక ఉపాధ్యాయుడు స్కూల్ వాట్సాప్ గ్రూప్లో అశ్లీల వీడియో పోస్ట్ చేశాడు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ ఘటన జరిగింది. అంబత్తూర్ ప్రాంతంలో నివసించే ఆర్ మతివానన్ పదేండ్లకు పైగా ప్రైవేట్ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. 12వ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల కోసం శిక్షణ కూడా ఇస్తున్నాడు. కాగా, శుక్రవారం రాత్రి మద్యం మత్తులో అశ్లీల వీడియోను స్కూల్కు చెందిన 12వ తరగతి విద్యార్థుల వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశాడు. దీంతో విద్యార్థులు, మిగతా టీచర్లు షాక్ అయ్యారు.
అయితే మద్యం మత్తులో తనకు తెలియకుండానే ఇది జరిగిందని ఆ ఉపాధ్యాయుడు తెలిపాడు. స్కూల్ యాజమాన్యం దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోస్కో చట్టం, సమాచార సాంకేతిక చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఆ టీచర్ను అరెస్ట్ చేశారు.