సూర్యాపేట : కారు అదుపుతప్పి ఆగిఉన్న లారీ కిందకు దూసుకెళ్లడంతో యువకుడు దుర్మరణం చెందగా కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి. సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన ఎదుట జాతీయ రహదారి -65పై ఈ దుర్ఘటన జరిగింది. వివరాలివి.. శాలిగౌరారం మండలం పెర్కకొండారం గ్రామానికి చెందిన కోటయ్యచారి (28) కుటుంబ సభ్యులతో కలిసి కారులో కోదాడకు బయల్దేరారు.
మునగాలలోని పీహెచ్సీ ఎదుటకు రాగానే కారు అదుపుతప్పి రోడ్డు వెంట నిలిపి ఉన్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో కారు నడుపుతున్న కోటయ్యచారి తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. అతడి తల్లి గిరమ్మ, భార్య ధనలక్ష్మి, చెల్లెలు నాగలక్ష్మి, భావ వెంకటాచారి, మరో ముగ్గురు చిన్నారులకు గాయాలయ్యాయి.
విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సూర్యాపేట జిల్లా కేంద్ర దవాఖానకు తరలించారు. వెంకటాచారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఖమ్మం తరలించారు. ఘటనాస్థలాన్ని సీఐ ఆంజనేయులు పరిశీలించారు. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.