నవీముంబై : మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు, వేధింపుల ఘటనలకు బ్రేక్ పడటం లేదు. నవీముంబైలోని కాలంబోలి ప్రాంతంలో పదేండ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆటోడ్రైవర్ (23)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఖర్గార్కు చెందిన నిందితుడు ఒంటరిగా ఉన్న బాలికతో పాటు ఆమె ఇద్దరు సోదరులను చికెన్ బిర్యానీ ఇప్పిస్తానంటూ ఆటోలో ఎక్కించుకుని వెళ్లాడు.
ఆపై ఇద్దరు బాలురను మధ్యలో విడిచిపెట్టి బాలికను ఖర్గార్లోని మూతపడిన గ్యారేజ్కు తీసుకువెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలురు ఇద్దరు ఎలాగోలా ఇంటికి చేరుకుని జరిగిన విషయం తల్లితండ్రులకు తెలిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను కాపాడారు. బాలిక ఇచ్చిన సమాచారంతో 12 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశారు.