హైదరాబాద్ : రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ స్టార్ హోటల్లో దారుణ ఘటన చోటు చేసుకున్నది. ఓ యువతిపై పలువురు యువకులు అసభ్యంగా ప్రవర్తించారు. రూఫ్ టాప్ లాంజ్‌లో జరగ్గా.. బడా వ్యక్తుల పిల్లలు ఉన్నట్టుగా సమాచారం. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత యువత ఇద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి ఐటీసీ కోహినూర్ సమీపంలోని రూఫ్ టాప్ పబ్‌కు వెళ్లింది. అయితే పబ్‌లో ఎనిమిది యువకులు ఆమె వద్దకు వచ్చి ఫోన్ నెంబర్ ఇవ్వాలని కోరగా.. ఇవ్వనని చెప్పడంతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు రేప్ చేస్తామని బెదిరింపులకు దిగారు.
ఈ క్రమంలో అక్కడే ఉన్న యువతి స్నేహితురాలు ఒకరు అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆమెపై మద్యం బాటిల్స్‌తో విచక్షణా రహితంగా యువకులు దాడి చేసినట్లు తెలిసింది. అడ్డుకోబోయిన పబ్ నిర్వాహకులను సైతం బెదిరించినట్లు సమాచారం. ఆ తర్వాత సంఘటనా స్థలం నుంచి బాధితురాలు ఆసుపత్రికి వెళ్లింది. అనంతరం రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని ఫిర్యాదు చేసింది. పబ్ సీసీ ఫుటేజీని బయటపెడ్డాలని యువతి డిమాండ్ చేసింది. బాధిత యువతి న్యూట్రిషనిస్ట్, డైటీషియన్‌గా పనిచేస్తున్నట్టుగా సమాచారం. అయితే, ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.