Atrocities in UP | బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై లైంగికదాడులు పెరిగిపోతున్నాయి. రెండు రోజుల క్రితం లక్నోలో యువతిపై ఆటోలో సామూహిక లైంగికదాడి జరిగింది. తాజాగా ఘజియాబాద్, ఆజంగఢ్‌లో ఇద్దరిపై అఘాయిత్యాలు జరిగాయి. మహిళల రక్షణకు పకడ్బంధీ చర్చలు తీసుకుంటున్నట్లు డబ్బా కొట్టుకుంటున్న యోగి ప్రభుత్వం.. వరుసగా జరుగుతున్న లైంగికదాడులను మాత్రం ఆపలేకపోతున్నదనే విమర్శలను ఎదుర్కొంటున్నది.
ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లో ఓ 40 ఏండ్ల మహిళను ఐదుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను చిత్రహింసలకు గురిచేసి జనపనార సంచిలో కుక్కి రోడ్డు వారగా పడేసి వెళ్లిపోయారు. సంచీలో నుంచి రక్తస్రావం అవుతున్నది గమనించిన స్థానికులు.. నంద్‌గ్రామ్ పోలీసులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని చికిత్స నిమిత్తం స్థానిక దవాఖానలో చేర్పించారు. కాగా, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్మన్ స్వాతి మలివాల్ బుధవారం ట్వీట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఢిల్లీకి చెందిన సదరు మహిళ ఈ నెల 16న పరిచయస్తుల పుట్టినరోజు వేడుకకు హాజరయ్యేందుకు ఘజియాబాద్ వెళ్లినట్లు తెలిసింది. ఆటో రిక్షా కోసం ఎదురు చూస్తున్న ఆమెను స్కార్పియో కారులో వచ్చిన నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. తనపై ఐదుగురు వ్యక్తులు రెండు రోజుల పాటు లైంగికదాడి చేయడమే కాకుండా చిత్రహింసలకు గురిచేసినట్లు బాధితురాలు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో తెలిపింది. ఇలాఉండగా, బాధిత మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
మరోవైపు, అజంగఢ్‌లో 22 ఏళ్ల మాదకద్రవ్యాలకు బానిసైన ఒక వ్యక్తి .. పొరుగున నివసించే ఎనిమిదేండ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడి గొంతు కోసి చంపాడు. నిందితుడిని లక్ష్మణ్‌గా గుర్తించారు. బాలిక ఇంటికి సమీపంలో నివసించే ఓ వ్యక్తి.. టోఫీలు ఇస్తానని ఆ చిన్నారిని ఆశపెట్టి ఏకాంత ప్రదేశానికి రప్పించి ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. గంటలు గడిచినా చిన్నారి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతకగా.. కొద్ది దూరంలో ఆమె మృతదేహం కనిపించింది. ఆజంగఢ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.