మంచిర్యాల : మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి తన తల్లినే చంపేశాడు. ఈ దారుణ ఘటన మంచిర్యాల జిల్లాలోని రాజీవ్ నగర్లో శనివారం రాత్రి చోటు చేసుకుంది. మంచిర్యాల ఎస్ఐ గంగరాం కథనం మేరకు సీతమ్మ(65) అనే మహిళ కూలీ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తోంది. ఆమె కుమారుడు కదమండ చంద్రశేఖర్ మద్యానికి బానిస అయి కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు.
అయితే శనివారం రాత్రి తనకు రూ. 200 కావాలని చంద్రశేఖర్ తన తల్లితో గొడవ పెట్టుకున్నాడు. డబ్బులు ఇచ్చేందుకు సీతమ్మ నిరాకరించింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న చంద్రశేఖర్.. తల్లిని గొడ్డలితో నరికి చంపాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం ఉదయం ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి కుమార్తె లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.