చాంద్రాయణగుట్ట : పాత ఇంటిని కూల్చివేస్తుండగా ఆకస్మాత్తుగా గోడకూలి ఓ కార్మికుడు మృతి చెందాడు.ఈ సంఘటన ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో రాజన్నబావి శివాజీనగర్ బస్తీలో జరిగింది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరా ల ప్రకారం..మహబూబ్‌నగర్ జిల్లా కంకర్ల గ్రామానికి చెందిన ఇ.కేశవులు (35), కుటుంబం ఇరవై ఏండ్ల క్రితం నగరానికి వలసవచ్చి ఛత్రినాక లక్ష్మీనగర్ బస్తీలో నివాసం ఉంటున్నారు.
కేశవులుకు భార్య నీలమ్మ, ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. భవన నిర్మాణాలకు సంబంధించిన కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.అయితే రెండు నెలల క్రితం మాలాద్రి అనే వ్యక్తి రాజన్నబావి శివాజీనగర్‌లో ఓ పాత ఇంటిని కొనుగోలు చేసి మరమ్మత్తులు చేపట్టాడు.ఈ క్రమంలో గుత్తదారి నర్సింగ్ వద్ద పని చేసే కేశవులు శుక్రవారం ఉదయం రోజు మాదిరిగానే పనిలో చేరాడు.
ఉదయం నుంచి ఇంటి లోపల గోడలను కూల్చివేస్తుండగా ఒక్కసారిగా గోడకూలీ అతని ఛాతిపై, ముఖం పై పడింది.ఈ ప్రమాదంలో కేశవులు అక్కడికక్కడే మృతి చెందాడు. రక్తపు మడుగులో ప్రాణాలు వదిలిన కేశవులును చూసి ఉలిక్కిపడ్డ గుత్తదారి నర్సింగ్ మృతుడి బంధువులకు సమాచారం అందించాడు.
విషయం పోలీసులకు తెలియడంతో సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఎస్సై మహేష్ వివరాలను సేకరించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చరీకి తరలించారు.గుత్తెదారి నర్సింగ్, ఇంటిని కొనుగోలు చేసి మర మ్మత్తులు చేపట్టిన మాలాద్రిలు మృతుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని మృతుడి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. కేసును ఛత్రినాక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.