ముంబై: ఆసుపత్రిలోని లిఫ్ట్ కూలింది. దీంతో అందులోని 9 మంది వైద్యులు గాయపడ్డారు. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. న్యూ పన్వెల్ నగరంలోని అమ్లే హాస్పిటల్లో మధ్యాహ్నం ఈ ప్రమాదం సంభవించింది. ఆసుపత్రి మూడో ఫ్లోర్లో కొందరు వైద్యులు భోజనం చేశారు. అనంతరం వారంతా గ్రౌండ్ ఫ్లోర్‌కు చేరేందుకు లిఫ్ట్ ఎక్కారు. అయితే అది రెండో ఫ్లోర్‌కు చేరగా లిఫ్ట్ మెటల్ రోప్ తెగిపోయింది. దీంతో గ్రౌండ్ ఫ్లోర్‌లోకి వేగంగా పడిపోయింది.
లిఫ్ట్ కూలిన సంఘటన గురించి తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది ఆ ప్రైవేట్ ఆసుపత్రికి చేరుకున్నారు. లిఫ్ట్‌లో చిక్కుకున్న డాక్టర్లను కాపాడారు. తీవ్రంగా గాయపడిన 9 మంది వైద్యులను చికిత్స కోసం మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే గాయపడిన డాక్టర్ల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని అధికారులు తెలిపారు. లిఫ్ట్‌లోకి పరిమితికి మించి ఎక్కువ మంది ఎక్కడంతో ఓవర్ లోడ్ వల్ల మెటల్ రోప్ తెగిందని చెప్పారు. ఈ ప్రమాదానికి ఇదే కారణమని వెల్లడించారు.