హైదరాబాద్ : హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో గంజాయి సరఫరా చేస్తున్న వారి పట్ల నిఘా పెంచిన పోలీసులు.. ఎక్కడికక్కడ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్‌పల్లిలో హాష్ ఆయిల్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. హాష్ ఆయిల్ విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 315 గ్రాముల హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు తెలిపారు.
మేడ్చల్ పరిధిలోని దూలపల్లిలో ఓ ముగ్గురు వ్యక్తుల నుంచి 14.5 కిలోల గంజాయిని పోలీసులు శుక్రవారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని విక్రయిస్తున్న వారిని ఒడిశాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. గంజాయిని విద్యార్థులకు, వలస కార్మికులకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. గంజాయితో పట్టుబడ్డ ముగ్గురు వ్యక్తులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
హాష్ ఆయిల్ కలిగి ఉన్న నలుగురు వ్యక్తులను నిన్న ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ ముఠా సభ్యుల నుంచి 52 లీటర్ల హాష్ ఆయిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ నుంచి హైదరాబాద్ మీదుగా ఢిల్లీకి గంజాయి నూనె తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.