కావలసిన పదార్థాలు
పుచ్చకాయ: మీడియం సైజు ఒకటి
నెయ్యి: రెండు టేబుల్ స్పూన్లు
పంచదార: కప్పు
పాలు: కప్పు
కోవా: అరకప్పు
యాలకులు: నాలుగు
జీడిపప్పు: గుప్పెడు
తయారు చేసే విధానం
ముందుగా పుచ్చకాయను తరిగి ముక్కలుగా చేసుకోవాలి. ఎరుపు గుజ్జు విడిగా తీసుకుని తెల్లగా ఉన్న భాగాన్ని తురుముకోవాలి. అది దాదాపు ఒక రెండు కప్పులు వచ్చేలా చూసుకోవాలి. పొయ్యి మీద బాణలి పెట్టి నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు పుచ్చకాయ తురుమును వేసి బాగా వేయించుకోవాలి. తురుము మంచిగా ఉడికాక అందులో పంచదార వేసి, మళ్లీ బాగా కలియబెట్టాలి.
పాకం పడుతున్న సమయంలో పాలు కూడా పోయాలి. ఈ మిశ్రమం ముద్దలాగా దగ్గరికి వచ్చిన తర్వాత, కోవాని తురుముకొని బాణట్లో వేయాలి. అందులోనే కొద్దిగా యాలకుల పొడి, వేయించిన జీడిపప్పులు కూడా వేసి కలియబెడితే క్యారెట్ హల్వా తరహాలో ఉండే పుచ్చకాయ హల్వా సిద్ధమైపోతుంది.