కావాల్సిన పదార్థాలు
సగం పండిన బొప్పాయి: ఒకటి
కందిపప్పు: చిన్న కప్పు
ధనియాలు: ఒక టేబుల్ స్పూన్
పచ్చి కొబ్బరి: కొద్దిగా
జీలకర్ర: అర స్పూను
మిరియాలు: అర స్పూను
పల్లీలు: అర కప్పు
ఎండు మిరపకాయలు: నాలుగైదు
ఆవాలు: అర స్పూను
ఇంగువ: చిటికెడు
నూనె: నాలుగు టేబుల్ స్పూన్లు
ఉప్పు: రుచికి తగినంత
ముందుగా బొప్పాయిని చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. పల్లీలను వేయించి పక్కకు పెట్టుకోవాలి. పప్పును ఉడికించుకోవాలి. ఇప్పుడు మిక్సీజార్లో పచ్చికొబ్బరి, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండు మిరపకాయలు, వేయించిన పల్లీలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీంతోపాటు నాలుగైదు బొప్పాయి ముక్కల్ని కూడా మిక్సీ తిప్పుకొని ఆ ముద్దను పక్కకు పెట్టుకోవాలి.
బాణట్లో కొద్దిగా నూనె వేసి తరిగిన బొప్పాయి ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు చల్లి మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత ఇందాక పట్టి పెట్టుకున్న మసాలా ముద్ద, పసుపు, సరిపడా ఉప్పు, ఉడికించి పెట్టుకున్న పప్పుతో పాటు ఒక గ్లాసుడు దాకా నీళ్లు పోసి బాగా మరగనివ్వాలి. చివర్లో జీలకర్ర, ఆవాలతో ఇంగువ పోపు వేస్తే కర్ణాటక స్టయిల్ బొప్పాయి కూట్ సిద్ధమైపోతుంది.