పర్యాటకం, పసందైన వంటకాలు వేర్వేరు కాదు. ఇప్పుడే టూర్ ప్యాకేజ్ చూసినా అందమైన ప్రదేశాలు, అద్బుతమైన కట్టడాలతోపాటు పసందైన విందు విశేషాలు కూడా జాబితాలో ఉంటున్నాయి. ఇలాంటి విందులో ఎవరికి నచ్చింది వాళ్లు ఎంచుకుంటారు. దేశీయంగా ఉండే పర్యాటక ప్రాంతాల్లో సరే.. కానీ, విదేశాలకు పోతే శాకాహారులకు ఏది తినాలో? ఏది తినకూడదో అర్థం కాక ఇబ్బందులు పడుతున్నారు. గుడ్డు, సీ ఫుడ్, మాంసం వద్దనుకుంటే గూగుల్ ట్రాన్స్‌లేట్ ఉపయోగించి మాట్లాడతారు. కానీ, శాకాహారమేనని వాళ్లు చెప్పే ఆహారంలో గుడ్డు, మరికొన్ని జంతు సంబంధమైన పదార్థాలు ఉపయోగిస్తారు. తూర్పు ఆసియా దేశాల్లో కోడిగుడ్డును శాకాహారంగా భావిస్తారు. బాలీ, ఇండోనేషియా, హాంగ్‌కాంగ్, థాయ్‌లాండ్‌లో అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే ప్రదేశాల్లో వెజిటేరియన్స్, వెగాన్స్ కోసం చాలారకాల వంటకాలు ఉంటాయి. కాకపోతే వాటిలో గుడ్డు వాడటం పరిపాటి. ఇలా ఊరు కాని ఊరు, దేశం కాని దేశంలో ఏం తినాలో? ఎక్కడ తినాలో కొంత గందరగోళంగా ఉంటుంది. ఇలాంటి సందేహాలు వచ్చినప్పుడు happycow.netలో లాగిన్ అవ్వండి. లేదా యాప్‌ని ఓపెన్ చేయండి. ఆ దేశ సంప్రదాయ వంటకాల్లో ఎలాంటి దినుసులు, కూరగాయలు, మాంసం ఉపయోగిస్తారో దీని ఆధారంగా తెలుసుకోవచ్చు. అభిరుచిని బట్టి డిష్‌లు ఎంచుకోవచ్చు. సమస్య లేదిక.