చిలగడ దుంపలు: పావుకిలో
చింతచిగురు: అరకప్పు
పచ్చిమిరపకాయలు: నాలుగు
ఆవాలు: అరటీస్పూను
మెంతులు: పావుస్పూను
పచ్చిశనగపప్పు, మినప్పప్పు: స్పూను చొప్పున
ఎండుమిరపకాయలు: నాలుగైదు
నూనె: రెండు టేబుల్ స్పూన్లు
ఇంగువ: కొద్దిగా
కొత్తిమీర: నాలుగు రెబ్బలు
పసుపు: చిటికెడు
ఉప్పు: తగినంత
తయారీ విధానం : ముందుగా బాణల్లో కొద్దిగా నూనె వేసి కాగాక పచ్చి శనగపప్పు, మినప్పప్పు వేయాలి. బంగారు రంగులోకి మళ్లుతుండగా…ఆవాలు, మెంతులు కూడా జోడించి చిటపటలాడనివ్వాలి. ఇంతలో ఎండుమిరపకాయల్ని మధ్యకు విరిచి పోపులో వేయాలి. అవి కూడా ఎర్రబడి తేలుతుంటే చిటికెడు ఇంగువను చటుక్కున వేశామంటే ఘుమఘుమలాడే సువాసన వస్తుంది. అప్పుడు పొయ్యి ఆపేసి ఆ మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకోవాలి. ఇంతలో చిలగడ దుంపల్ని శుభ్రంగా చెక్కుదీసి తురుముకోవాలి. చింతచిగురుని కూడా కడిగి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఇందాక వేయించి పెట్టుకున్న పోపు మిశ్రమాన్ని తీసుకొని కచ్చాపచ్చాగా పొడి పట్టాలి. ఇప్పుడే పసుపుతో పాటు, పచ్చడికి సరిపడా ఉప్పు వేయడం మర్చిపోకూడదు. ఇప్పుడు బాణల్లో నూనెవేసి చిలగడ దుంపల తురుము, చింతచిగురు వేయించుకోవాలి. వాటిని కూడా మిక్సీలో ఉన్న మిశ్రమానికి జోడించి వేసి మరీ మెత్తగా కాకుండా ఓ పట్టు పట్టి ఆపేసి చివర్లో పచ్చిమిరపకాయల పోపు పెట్టి, కొత్తి మీర చల్లుకుంటే.. ఇక మనం పట్టు పట్టడమే తరువాయి!