పేదరికాన్ని జయించి ఐపీఎస్ సాధించిన మనోజ్ కుమార్ శర్మ జీవితం ఆధారంగా దర్శకుడు విధు వినోద్చోప్రా రూపొందించిన ‘12th ఫెయిల్’ చిత్రానికి సర్వత్రా ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రానికి ప్రీక్వెల్‌గా తెరకెక్కించిన ‘జీరో సే రీస్టార్ట్’ టీజర్‌ను గురువారం విడుదల చేశారు. డిసెంబర్ 13న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ‘మీరు తొలిసారి కలగన్నప్పుడు దాని గురించి ఏమని ఆలోచించారు..’ అనే వాయిస్ ఓవర్‌తో మొదలైన టీజర్ ఆద్యంతం స్ఫూర్తినింపేలా సాగింది. మనం ఏ రంగంలోని వ్యక్తులమైనా కావొచ్చు..మన జీవితం ఎక్కడైనా ఆగిపోయి వుండొచ్చు.. కానీ మనందరి కథ ఎక్కడో ఓ చోట ఓ అమాయకంగా, స్వచ్ఛంగా కన్న కల నుంచే మొదలవుతుంది. మనందరి జీవితాల్లో జీరో మూమెంట్ అన్నది తప్పకుండా ఉంటుంది. కానీ అక్కడే అసలైన జీవితం మొదలవుతుంది. స్వప్నాలను సాకారం చేసే ఓ మహోత్సవం ఈ సినిమా. జీవితాన్ని ఎప్పుడైనా తిరిగి మొదలుపెట్టొచ్చనే స్ఫూర్తికి ఈ కథ ఓ నిదర్శనం.’ అంటూ దర్శకుడు విధు వినోద్చోప్రా సినిమా గురించి వ్యాఖ్యానించారు. కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఈ సినిమాను పూర్తి చేయడం విశేషం. మనోజ్శర్మ బాల్యం నుంచి ఆయన కాలేజీ రోజుల వరకు సాగిన ప్రయాణాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించబోతున్నారు.