Veena Rao | దివంగత నందమూరి హరికృష్ణ మనవడు, నందమూరి జానకిరామ్ తనయుడు నందమూరి తారక రామారావుని హీరోగా పరిచయం చేస్తూ దర్శక, నిర్మాత వైవీఎస్ చౌదరి ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో తెలుగమ్మాయి వీణారావు కథానాయికగా పరిచయం అవుతున్నది. శనివారం వీణారావు ఫస్ట్ లుక్‌ని ప్రొడ్యూసర్స్ సుప్రియ యార్లగడ్డ, స్వప్న దత్‌లు లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా ప్రదర్శించిన షో గ్లింప్స్‌లో సంప్రదాయబద్ధంగా, మోడ్రన్ అవుట్ ఫిట్స్‌లో బ్యూటీఫుల్‌గా వీణారావు దర్శనమిచ్చారు. కథ, సన్నివేశాలు, పాత్రలకు అనుగుణంగా నటించి, ప్రేక్షకుల్ని రంజింపజేయడంలో తన వంతు కృషి చేస్తానని తన అభిమాన నటి డాక్టర్ పి.భానుమతి రామకృష్ణ సాక్షిగా వీణారావు ప్రమాణం చేశారు.
తెలుగమ్మాయి వీణారావు ప్రతిభావంతురాలైన కూచిపూడి డ్యాన్సర్ అని, తెరపై అద్భుతమైన నటిగా కూడా రాణించే టాలెంట్ తనకుందని, యంగ్ చాప్ ఎన్టీఆర్ ఫస్ట్‌లుక్‌కి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన స్పందన వచ్చిందని, అలాగే వీణారావు కూడా అందరికీ నచ్చుతుందని దర్శకుడు వైవీయస్ చౌదరి ఆశాభావం వెలిబుచ్చారు.
ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన నిర్మాతలు స్వప్నదత్, సుప్రియ యార్లగడ్డ చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. త్వరలో షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రానికి మాటలు: సాయిమాధవ్ బుర్రా, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, సాహిత్యం: చంద్రబోస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రమేష్ అత్తిలి, నిర్మాత: యలమంచిలి గీత, నిర్మాణం: న్యూ టాలెంట్ రోర్స్.