Jason Sanjay | తమిళ స్టార్ నటుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ తన బాల్యంలో జరిగిన ఒక సరదా సంఘటనను గుర్తుచేసుకున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. గత కొంతకాలంగా తండ్రీకొడుకుల మధ్య విభేదాలు నడుస్తున్నాయంటూ, అలాగే విజయ్ నుండి ఆయన భార్య సంగీత విడాకులు తీసుకోబోతున్నారంటూ నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జేసన్ సంజయ్ తన తండ్రి పేరులోని మొదటి అక్షరం ‘V’ ని తొలగించి, తల్లి పేరులోని ‘S’ ని చేర్చుకున్నాడనే రూమర్స్ కూడా వచ్చాయి. అయితే తాజాగా వైరల్ అవుతున్న రూమర్స్ అన్నింటికీ పరోక్షంగా ఫుల్స్టాప్ పెట్టాడు జేసన్.,
ప్రస్తుతం జేసన్ సంజయ్ దర్శకుడిగా మారి ‘సిగ్మా’ (Sigma) అనే సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నటిస్తున్న సీరియల్ నటుడు జెమిని మణి తన కుమారుడితో కలిసి జేసన్ సంజయ్ షూటింగ్ సెట్స్‌లో సరదాగా మాట్లాడుతున్న తరుణంలో ఈ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. తాను ఐదో తరగతి చదువుతున్నప్పుడు ఒకరోజు స్కూల్ బయట తన తండ్రి విజయ్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో, ఒక వ్యక్తి అకస్మాత్తుగా వచ్చి నన్ను ఎత్తుకుని కారు వైపు పరిగెత్తాడని, దాంతో తాను నిజంగానే కిడ్నాప్ చేస్తున్నారేమోనని ఎంతో భయపడ్డానని సంజయ్ చెప్పుకొచ్చారు. అయితే వయసు పెరిగిన కొద్ది ఆ సంఘటనను తాను పూర్తిగా మర్చిపోయానని, కానీ ఈ మధ్య షూటింగ్లో జెమిని మణి తనను కలిసి, నాటి రోజుల్లో నిన్ను ఎత్తుకెళ్ళింది నేనేనంటూ ఆ పాత జ్ఞాపకాన్ని గుర్తుచేశారని సంజయ్ నవ్వుతూ వివరించారు.
ఈ విషయంపై నటుడు జెమిని మణి స్పందిస్తూ ఆ రోజు జరిగిన అసలు నిజాన్ని వెల్లడించారు. అది నిజమైన కిడ్నాప్ కాదని, కేవలం విజయ్ను దగ్గరి నుండి చూడాలనే కోరికతో చేసిన ఒక చిన్న సరదా ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు. జేసన్ సంజయ్ అడయార్‌లోని ఒక పాఠశాలలో చదువుతున్న రోజుల్లో, విజయ్ అప్పుడప్పుడు స్వయంగా డ్రైవర్ లేకుండా తన కారులో కుమారుడిని ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చేవారని, ఆ సమయంలో ఎలాగైనా విజయ్ను కలవాలని తాను ఒక ప్లాన్ వేశానని చెప్పారు. ఒకరోజు స్కూల్ వాచ్మెన్ జేసన్‌ను విజయ్ కారు దగ్గరకు తీసుకువెళ్తుండగా, తాను మధ్యలోనే జేసన్‌ను ఎత్తుకుని విజయ్ ఉన్న కారు వైపు పరిగెత్తానని, కారు డోర్ తెరవగానే లోపల ఉన్న విజయ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, నవ్వుతూ బై చెప్పి వెళ్ళిపోయారని జెమిని మణి వివరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
మరోవైపు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ‘సిగ్మా’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ హై-స్టేక్స్ హీస్ట్ చిత్రంలో ఫరియా అబ్దుల్లా, రాజు సుందరం, అన్బు దాసన్, యోగ్ జేపి, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. యాక్షన్, హ్యూమర్, ట్రెజర్ హంట్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ సినిమాను చెన్నై, తలకోన, థాయిలాండ్, సేలం వంటి ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఎంతో గ్రాండ్‌గా రూపొందుతున్న ఈ చిత్రం జూలై 31న థియేటర్లలో విడుదల కాబోతుంది.
A Cute & Fun Video of #JasonSanjay interacting with a kid😄♥️
Hearing his voice after very long. So calm & down to earth 👌🥰pic.twitter.com/dC8lLdb7b1
— AmuthaBharathi (@CinemaWithAB) June 30, 2026