బాలీవుడ్ యువ హీరో ఇషాన్ ఖట్టర్ మరో హాలీవుడ్ ఆఫర్ దక్కించుకున్నారు. ‘డోంట్ లుక్ అప్’ అనే సినిమాతో గతంలోనే హాలీవుడ్ అరంగేట్రం చేసిన ఇషాన్‌కు ఇది రెండో ప్రాజెక్ట్. నికోలె కిడ్మాన్, లేవ్ ష్రైబర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్ సిరీస్‌లో ఇషాన్‌ను ఓ ముఖ్య పాత్రకు ఎంపిక చేశారు.
ఎలిన్ హిల్డెర్ బ్రాండ్ రాసిన ‘ది పర్ఫెక్ట్ కపుల్’ నవల ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కనుంది. వచ్చే వారం నుంచి ఈ వెబ్ సిరీస్ సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం. హీరో షాహిద్ కపూర్ సోదరుడైన ఇషాన్ కట్టర్ బాలీవుడ్లో మరో వారసుడిగా అడుగుపెట్టారు. ‘వాహ్.. లైఫ్ హోతో ఐసీ’ చిత్రంతో బాల నటుడిగా పరిచయమై…‘ధడక్’ చిత్రంతో హీరోగా మారి మంచి విజయాన్ని దక్కించుకున్నారు. ఆయన నటించిన ‘ఖాలీ పీలి’, ‘ఫోన్ బూత్’ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇషాన్ కొత్త సినిమా పిప్పా విడుదలకు సిద్ధమవుతున్నది.