Yellamma Movie | డైరెక్టర్‌గా వేణు యెల్దండికి భారీ పేరు తీసుకొచ్చిన చిత్రం బలగం. ఆ సూపర్ హిట్ మూవీ తర్వాత ఆయన తెరకెక్కించబోయే కొత్త సినిమా ‘ఎల్లమ్మ’ పై గత కొంత కాలంగా టాలీవుడ్లో భారీ క్రేజ్ నెలకొంది. అయితే ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్ అధికారికంగా సెట్స్‌పైకి వెళ్లకపోవడం, హీరోయిన్, హీరో ఎంపికపై ఊహాగానాలు చక్కర్లు కొట్టడం మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించనున్నారు. మొదట్లో ‘ఎల్లమ్మ’ సినిమాలో యంగ్ హీరో నితిన్ హీరోగా నటించనున్నారని ప్రచారం జరిగింది. దిల్ రాజు స్వయంగా ఒక కార్యక్రమంలో ఇది వెల్లడించారు. అంతేకాదు, నితిన్ నటించిన ‘తమ్ముడు’ సినిమా రిలీజ్ అయిన తర్వాతే ఈ ప్రాజెక్ట్ మొదలవుతుందని ప్రకటించారు. అయితే ఇటీవల నితిన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు వార్తలు వెలువడ్డాయి. దీంతో ‘ఎల్లమ్మ’ లో హీరోగా మరొకరిని తీసుకునే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని టాక్.
నితిన్ స్థానంలో మొదటగా శర్వానంద్ పేరు వినిపించింది. కథ వినిపించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కూడా ప్రచారం జరిగింది. కానీ తాజాగా సోషల్ మీడియాలో కొత్త పేరు హల్చల్ చేస్తోంది. అది ఎవరో కాదు ఇటీవల ‘కిష్కింధపురి’ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఇప్పటికే నిర్మాతలు బెల్లంకొండతో చర్చలు జరుపుతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘ఎల్లమ్మ’ ప్రాజెక్ట్ బెల్లంకొండ కాంపౌండ్ లోకి వెళ్లిందన్న వార్తలు వైరల్‌గా మారాయి. మేకర్స్ త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నట్టు కూడా సమాచారం.
వేణు యెల్దండికి దిల్ రాజు బలమైన సపోర్ట్ అందిస్తున్న నేపథ్యంలో, ఈ ప్రాజెక్ట్‌ను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కించనున్నారని సమాచారం. అన్నీ అనుకున్నట్లే జరిగితే, వచ్చే కొన్ని వారాల్లోనే ఎల్లమ్మ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ‘టైసన్ నాయుడు’ అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు. డిసెంబర్లో ఈ సినిమా విడుదలకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే ‘కిష్కింధపురి’ హిట్ తర్వాత ఆయనకి మళ్లీ క్రేజ్ పెరిగింది. ఇప్పుడు ‘ఎల్లమ్మ’ లాంటి ఎమోషనల్ కంటెంట్ ఉన్న సినిమాలో ఆయన భాగం కావడం టాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది. మొత్తానికి ‘ఎల్లమ్మ’ ప్రాజెక్ట్ ఎవరితో సెట్స్‌పైకి వెళ్తుందనేది అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడక తప్పదు