‘కేజీఎఫ్’ ప్రాంఛైజీ చిత్రాలు కన్నడ నటుడు యష్‌కు దేశవ్యాప్తంగా తిరుగులేని గుర్తింపును తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఆయన బాలీవుడ్ ‘రామాయణ’లో రావణాసురుడిగా కనిపించబోతున్నారు. మరోవైపు ఆయన నటిస్తున్న పాన్ ఇండియా గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘టాక్సిక్’ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. గీతూ మోహన్‌దాస్ దర్శకురాలు. ఈ సినిమా విడుదల ఆలస్యం కావొచ్చని ఇటీవల సోషల్‌మీడియాలో ప్రచారం మొదలైంది. ఈ విషయం మీద నిర్మాతలు స్పష్టతనిచ్చారు.
ముందుగా ప్రకటించినట్లుగా వచ్చే ఏడాది మార్చి 19న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని తెలిపారు. 1970 దశకం గోవా నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలయ్యాయని, వివిధ భాషల్లో భారీ స్థాయిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని మేకర్స్ తెలిపారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై కె.నారాయణ, యష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.