యష్ పూరి, స్టెఫీ పటేల్ జంటగా నటిస్తున్న సినిమా ‘చెప్పాలని ఉంది’. ఒక మాతృభాష కథ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రాన్ని సూపర్‌గుడ్ ఫిలింస్ పతాకంపై ఆర్బీ చౌదరి సమర్పణలో వాకాడ అంజన్ కుమార్, యోగేష్ కుమార్ నిర్మిస్తున్నారు. అరుణ్ భారతి ఎల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో యష్ పూరి మాట్లాడుతూ…‘చదువుకునేప్పటి నుంచి నాకు నటుడిని కావాలనే కల ఉండేది. క్రికెట్ కూడా బాగా ఆడేవాడిని.
నటుడిని కావాలని ముంబై వెళ్లి మూడు వేల ఆడిషన్స్ చేసినా అవకాశం దక్కలేదు. నా తొలి చిత్రం సూపర్‌గుడ్ లాంటి పెద్ద సంస్థలో చేయడం గర్వంగా ఉంది. మన మాతృభాష గొప్పదనాన్ని చెప్పే చిత్రమిది. అలా అని సందేశాత్మకంగా ఉండదు. పూర్తి కమర్షియల్‌గానే సాగుతుంది. ఈ చిత్రంలో నేను జర్నలిస్ట్ చంద్రశేఖర్ పాత్రలో కనిపిస్తాను. ఉన్నట్లుండి మాతృభాష మర్చిపోతే అతను ఎలాంటి ఇబ్బందులు పడతాడు అనేది చూపించాం. ఓ కొత్త భాష మాట్లాడే అతనికి అంతా దూరమవుతారు. ఇలా మాట్లాడేందుకు ప్రాక్టీస్ చేశాను.
ప్రేక్షకులకు అర్థమయ్యేలా ఆ భాష ఉండాలని స్క్రిప్ట్ చేశాం. పరాయి భాషను గౌరవిద్దాం, మాతృ భాషను ప్రేమిద్దాం అనే మంచి విషయాన్ని చెబుతున్నాం. పాత్రికేయులు గర్వపడే సన్నివేశాలుంటాయి. కాశ్మీర్లో చేసిన షూటింగ్ సినిమాకు ఆకర్షణ అవుతుంది. కామెడీ, డ్రామా, రొమాన్స్, యాక్షన్ వంటి అంశాలుంటాయి. ఈ వారం చాలా సినిమాలు విడుదలవుతున్నాయి. అయితే మా సినిమా మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. గెలుపు ఓటముల్లో ఒకేలా ఉండటం క్రికెట్ ఆడేప్పుడు తెలుసుకున్నా. ఇదే దృక్పథంతో నటుడిగా కెరీర్ కొనసాగిస్తా. నా తదుపరి సినిమా సిల్లీ మాంక్ సంస్థలో ఉంటుంది’ అని అన్నారు.