బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారి రూపొందిస్తున్న ‘రామాయణ’ చిత్రంలో తాను రావణుడి పాత్రలో నటిస్తున్నట్లు కన్నడ అగ్ర నటుడు ‘కేజీఎఫ్’ ఫేమ్ యష్ అధికారికంగా ప్రకటించారు. రావణాసురుడి క్యారెక్టర్లో నటించడానికి యష్ సుముఖంగా లేరని బాలీవుడ్ మీడియాలో కొన్ని వార్తలొచ్చాయి. వీటిపై యష్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘రామాయణ’ వంటి డ్రీమ్ ప్రాజెక్ట్స్ కార్యరూపం దాల్చాలంటే అగ్ర హీరోలు స్టార్డమ్, ఇమేజ్ పట్టింపులను పక్కనపెట్టి విశాల దృక్పథంతో ఆలోచించాలని చెప్పారు.
‘అంత భారీ బడ్జెట్, తారాగణంతో సినిమా తీయడం మామూలు విషయం కాదు. అందుకే ఈ సినిమాలో భాగమవుతున్నా. రావణ పాత్ర నన్ను బాగా ఎక్సైట్ చేసింది. ఆ పాత్రలో డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తాయి. ఓ నటుడిగా నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ఇదొక మంచి అవకాశం’ అన్నారు. సాయిపల్లవి, రణబీర్‌కపూర్ సీతారాములుగా నటిస్తున్న ఈ సినిమా కొద్ది మాసాల క్రితమే సెట్స్‌మీదకు వెళ్లింది. ప్రస్తుతం ముంబయిలో చిత్రీకరణ జరుగుతున్నది.