అగ్ర కథానాయకుడు చిరంజీవి తన జీవిత చరిత్ర పుస్తకం రాసే బాధ్యతను ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌కు అప్పగించారు. ఈ విషయాన్ని చిరునే స్వయంగా వెల్లడించారు. లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖ రుషికొండ ఏ-1 గ్రాండ్ కన్వెన్షన్ వేదికగా ఎన్టీఆర్ 28వ పుణ్యతిథి, ఏఎన్నార్ శత జయంతి కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరై మాట్లాడారు.
‘నేను స్టార్‌గా ఎదగడానికి యండమూరి రచనలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఆయన మేధాసంపత్తి నుంచి వచ్చిన పాత్రలే నా కెరీర్‌కు సోపానాలు అయ్యాయి. ఆయన సినిమాలతోనే నాకు మెగాస్టార్ బిరుదు వచ్చింది. ‘అభిలాష’ నవల గురించి నాకు మొదట మా అమ్మ చెప్పింది. అదే నవలను కేఎస్ రామారావుగారు నన్ను హీరోగా పెట్టి సినిమా తీశారు. కోదండరామిరెడ్డి దర్శకత్వం, ఇళయరాజా పాటలు మంచి పేరు తెచ్చాయి. కెరీర్లో నేను సుస్థిర స్థానం ఏర్పర్చుకోవడానికి ఉపయోగపడ్డాయి. ‘ఛాలెంజ్’ ఎంతో మంది యువతను ప్రభావితం చేసింది.
నా సినిమా విజయాల్లో సింహభాగం యండమూరి వీరేంద్రనాథ్ రచనలదే. ఆయన నా బయోగ్రఫీ రాస్తాననడం నిజంగా సంతోషంగా ఉంది’ అన్నారు. ఇంకా ఎన్టీఆర్, ఏఎన్నార్లతో తనకు ఉన్న అనుబంధాన్ని, సాన్నిహిత్యాన్ని చిరంజీవి ఈ వేదికపై పంచుకున్నారు. పలువురు సినీ, సాహిత్య, సంగీత ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.