బాలీవుడ్లో పదేండ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది అందాల తార యామీ గౌతమ్. ‘వికీ డోనర్’ చిత్రంతో విజయాన్ని సాధించి వెలుగులోకి వచ్చిన ఈ భామ ‘బద్లాపూర్’, ‘కాబిల్’, ‘ఉరి’, ‘ద సర్జికల్ స్ట్రైక్’, ‘బాల’ వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఆమె కొత్త సినిమా ‘లాస్ట్’ ప్రస్తుతం జరుగుతున్న ఇఫ్పీ వేడుకల్లో ప్రదర్శితమవుతున్నది.
ఈ చిత్రంలో శిఖా శర్మ అనే క్రైమ్ రిపోర్టర్ పాత్రలో నటించింది యామీ. అపహరణకు గురైన థియేటర్ యాక్టివిస్ట్ కేసు ఇన్వెస్టిగేషన్లో ఆమె చేసిన పరిశోధన ఏంటనేది ఈ చిత్రంలో ఆసక్తికరంగా చూపించారు. ఇఫ్పీలో తన సినిమా ‘లాస్’్టకు వస్తున్న స్పందన పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసింది యామీ గౌతమ్. తన నట ప్రయాణంపైనా సంతృప్తిగా ఉన్నట్లు చెప్పింది. యామీ మాట్లాడుతూ…‘కెరీర్లో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాను. చివరకు అవన్నీ మంచే చేశాయి.
నా మొదటి సినిమా విజయవంతం అయ్యాక ఎలా ముందుకు సాగాలో అర్థం కాలేదు. నాకొస్తున్న అవకాశాలు మనసుకు నచ్చేవి కావు. అయితే వాటిని వదులుకుని ఖాళీగా ఉండాలా, లేక అలాంటి కథలతోనే అదృష్టాన్ని పరీక్షించుకోవాలా అర్థమయ్యేది కాదు. కొన్నాళ్లకు సొంత ఊరు వదిలి నేనెందుకు ఫిలిం ఇండస్ట్రీకి వచ్చాను అనేది తెలుసుకోగలిగా. ఆ క్రమంలోనే నా సినిమాలను ఎంచుకుంటున్నా. ‘లాస్ట్’ సినిమాలో నేను క్యారెక్టర్లో నటించలేదు. ఆ పాత్రగా మారిపోయాను’ అని చెప్పింది. ప్రస్తుతం యామీ ‘చోర్ నికల్కే భాగా’, ‘ఓ మై గాడ్ 2’ చిత్రాల్లో నటిస్తున్నది.