Simbu-Goutham Menon | తమిళ స్టార్ శింబు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ‘మన్మధ’, ‘వల్లభ’ వంటి సినిమాలతో తెలుగులోనూ మంచి క్రేజ్ ఏర్పరచుకున్నాడు. ఇటీవలే ‘మానాడు’ సినిమాతో సూపర్ హిట్‌ను సాధించాడు. గత కొంత కాలం నుంచి వరుస ప్లాప్‌లు వెంటబడుతున్న సమయంలో శింబుకు మానాడు మంచి కంబ్యాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఈయన తమిళంలో ‘వెందు తానింధాతు కాదు’ చిత్రంలో నటిస్తున్నాడు. గౌతమ్ వాసు దేవ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్నాడు.
మొదటి నుంచే ఈ చిత్రంపై ప్రేక్షకులలో మంచి అంచనాలే ఉన్నాయి. గతేడాది విడుదలైన శింబు ఫస్ట్‌లుక్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. ఆ పోస్టర్లో శింబు సన్ననైన దేహంతో చేతిలో కర్ర పట్టుకొని నిల్చున్న ఫోటో అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ చిత్రంలో శింబు రెండు గెటప్స్‌లలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. దర్శకుడు గౌతమ్ మీనన్ సోషల్ మీడియాలో పోస్టర్‌ను విడుదల చేస్తూ షూటింగ్ పూర్తయిందని పేర్కొన్నాడు. ఆస్కార్ గ్రహిత ఏ.ఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చాడు.
గతంలో వీళ్ళ కాంబోలో తెరకెక్కిన ‘విన్నైతండి వరువాయ’, ‘అచ్చం యెన్బాదు మడమైయాడ’ మంచి విజయాలు సాధించాయి. తెలుగులో ఈ రెండు చిత్రాలు ‘ఏమాయ చేశావే’, ‘సాహసం శ్వాసగా సాగిపో’ టైటిల్స్‌తో నాగ చైతన్యతో గౌతమ్ మీనన్ ఏకకాలంలో తెరకెక్కించాడు. ఇక ఈ సారి శింబుతో ఎలాగైనా హ్యట్రిక్ సాధించాలని కసితో ఉన్నాడు. గౌతమ్ మీనన్ ఒక వైపు దర్శకుడిగా చేస్తూనే నటుడిగా కూడా బిజీ బిజీగా గడుపుతున్నాడు.