‘పుష్ప అంటే ఫ్లవరనుకుంటివా! ఫైర్..’అవును! పుష్ప… డైరెక్టర్ సుకుమార్ పెరట్లో పూసినపువ్వు కాదు. అతని బుర్రలో చెలరేగిన ఫైర్!!అది ఎంతలా రాజుకుందంటే..మన ైస్టెలిష్ అల్లు అర్జున్ను.. గ్లోబల్ స్టార్‌గా మండే వరకు వదిలిపెట్టలేదు!
ఇప్పుడు వస్తున్న పుష్ప అట్లాంటి ఇట్లాంటి ఫైర్ కాదు.. వైల్డ్ ఫైర్!లోకల్ కాదు.. నేషనల్.. ఇంటర్నేషనల్!! విడుదలకు ముందే… ఈ వైల్డ్ ఫైర్ సెగ బాక్సాఫీస్ పాత రికార్డులకు తాకింది.ఓ స్మగ్లర్ కథ కోసం ఎందుకంత వెయిటింగ్!పుష్ప: ద రైజ్‌లో కొంత రీజన్ తెలిసింది. సీక్వెల్లో సీరియస్ ఆన్సర్ దొరుకుతుందేమో! కచ్చితంగా దొరుకుతుంది.. ఎందుకంటే! ఇది సుకుమార్ సినిమా కదా!! అల్లు అర్జున్ హీరో కదా!!
మూడేండ్ల ముందట కేశవుడు చెప్పిన కథ.. పుష్ప. చెప్పించిన వాడు దర్శకుడు సుకుమార్. ఆ కథలో జీవించిన వాడు అల్లు అర్జున్. ఈ స్టయిలిష్ స్టార్ ఇంత రఫ్ లుక్‌లో అప్పటి వరకు ఏ సినిమాలో కనిపించలేదు. కానీ, ఎంత మోటుగా అనిపించినా… మరెంత ఘాటుగా ప్రవర్తించినా.. ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేశారు. సుకుమార్ సృష్టించిన పాత్ర స్వభావం అలాంటిది! తరచి చూస్తే కథానాయకుడికి ఫిజికల్‌గా కొంత లోపమున్నా.. అదీ స్టయిల్‌గా మారిపోయింది. ఆ ఫిజికల్ డిఫెక్ట్కు డైరెక్టర్ చూపించిన రీజన్ లాజికల్‌గా కాదు కానీ, ఎమోషనల్‌గా యాప్ట్ అనిపించింది. పచ్చి స్మగ్లర్ కథ. అయితేనేం యాటిట్యూడ్‌తో అతణ్ని హీరోను చేశాడు. ఇంతటి విధ్వంస రచనలోనూ సుకుమార్ లెక్క తప్పలేదు. సినిమాలో ఒక్క చెట్టూ నేలకూలదు. ఒక్కచోట.. ఓ చెట్టు మొదలుపై గొడ్డలి పోటు సుతారంగా తాకినట్టు కనిపిస్తుందంతే!
చెట్టును పొట్టన పెట్టుకున్న పుష్పను ప్రేక్షకులు కోపగించుకోలేదు సరికదా… ఆసక్తిగా చూశారు. ఎర్ర చందనం దుంగలు పోలీసుల కంట పడకుండా తెలివిగా తప్పించిన అతని తెలివికి అబ్బురపడ్డారు. శ్రీవల్లిని తెగ ప్రేమించిన వైనానికి మురిసిపోయారు. మోటు సరసానికి రమ్మని.. గౌరవంగా పంపించిన తీరుకు ముచ్చటపడ్డారు. ‘చూపే సింగారమాయనే..’ అంటూ చెప్పు ఊడగొట్టుకొని స్టెప్పేసినా ఊగిపోయారు. గల్లీ పోరగాళ్లు మాత్రమే కాదు.. సిడ్నీ సిన్నోడు వార్నర్ సైతం.. ‘తగ్గేదే లే’ అని చిందేశాడు. పుష్ప గడ్డం సవరించుకున్న తీరుకూ ఫిదా అయ్యారు. పొలిటికల్ పంచ్‌లకూ వాడేశారు. అంతెందుకు, అప్పటి వరకు చూడబుద్ధికాని గుబురు గడ్డాలు కూడా.. పుష్ప మానియాతో తెగ ముద్దొచ్చేశాయి. మరీ ముఖ్యంగా పార్ట్ టూలో శ్రీవల్లి పాదపంకజం పుష్ప గడ్డాన్ని సవరించిన తీరును ప్రాక్టికల్‌గా ఎంతమంది పాటిస్తారో.. సామాజిక మాధ్యమాల్లో ఎన్నిరీల్స్కు దారితీస్తుందో చూడాలి.
ఇప్పుడు ద రూల్కి వద్దాం. పుష్పకు మద్దతుదారులు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? అతను ఎందుకు కనిపించకుండా పోయాడు? పుష్ప ఆచూకీ గల్లంతు అయితే.. నెల రోజులు అల్లర్లు చెలరేగేంతలా అతనేం చేశాడు? ‘సంపాదించిన దుడ్డు ఏం చేస్తున్నారో చెప్తున్నారా?’ అని ఓ పెద్దాయన మాటలకు, పుష్పకు లింకేంటి? అప్పుడెప్పుడో విడుదలైన టీజర్ విసిరిన ప్రశ్నలివి. వీటన్నిటికీ సుకుమార్ చూపించే సమాధానం ఎట్లా ఉండబోతున్నదో? టీజర్లో పులిని రెండడుగులు వెనక్కి వేయించి పుష్ప దమ్మును తెలియజెప్పిన డైరెక్టర్.. ఈ సినిమాతో ఐకాన్ స్టార్ అభిమానులను పది అడుగులు ముందుకు వేసేలా చేయబోతున్నాడని అనుకోవచ్చేమో!
Pushpa2
తెలుగు వెండితెరపై ‘జగడం’ నుంచి మొదలైన సుకుమార్ మార్క్.. రిమార్క్ లేకుండా సాగిపోయింది. ఆర్య, ఆర్య 2 సినిమాల్లో డిఫరెంట్ బన్నీని చూపించాడు. సుకుమార్ లెక్క, బన్నీ ఫిజిక్ పక్కాగా కలిసిన చిత్రం పుష్ప. లెక్కలొచ్చినోడికి ఫిజిక్స్ సబ్జెక్టు అంటే వల్లమాలిన అభిమానం ఉంటుంది. అంతకుముందు ‘నాన్నకు ప్రేమతో’లో వేగం, త్వరణం, కోణం ఇలా మ్యాథ్స్‌ను, ఫిజిక్స్‌ను కలిపి హీరోతో విలన్లను స్టయిల్‌గా కొట్టించిన సుకుమార్.. పుష్ప-2లో విచ్చలవిడిగా ప్రయోగాలు చేసినట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. బౌండెడ్ స్క్రిప్ట్ అన్నది చరిత్ర పాఠాలు చెప్పే మాస్టార్ల పద్ధతి. కానీ, ఈ మ్యాథ్స్ పండితుడి తీరే వేరు! ఒక్క ఈక్వేషన్‌కి వందల ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయించడం ఈ సారు మాడల్. ట్యూషన్ మాస్టార్ అనుభవమో ఏమో కానీ, సీన్ బెటర్‌గా రావడం కోసం స్క్రిప్ట్‌ను ఎన్ని రకాలుగా మార్చడానికైనా సుకుమార్ సిద్ధం. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బన్నీ చెబుతూ ‘నేను ఈ రోజు రాసుకుంటా డార్లింగ్.. ఇవాళ్టి షూట్ రేపు ప్లాన్ చేద్దామా’ అనేవాడట సుకుమార్! స్క్రిప్ట్‌లో బెటర్మెంట్ కోసం సెట్స్‌లోనూ తపస్సు చేసేవాడని ఈ మాటలతో అర్థమవుతుంది.
మ్యాజిక్ ఉన్న చోట లాజిక్కు చోటు ఉండదని సినీపండితుల విశ్లేషణ. కానీ, ఎంత మ్యాజిక్ చేసినా.. లాజిక్ మిస్సవ్వకుండా జాగ్రత్తపడతాడు సుకుమార్. అల్లు అర్జున్ ఎన్ని విన్యాసాలు చేసినా ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే స్టయిలిష్ స్టార్‌గా ఆయన యాక్షన్ కూడా క్లాస్‌గా ఉంటుంది. ఈ ఒక్కడు చాలదన్నట్టు అతని చుట్టూ భారీ తారాగణం. ఎవరి రేంజ్ వారిది. ఫహాద్ ఫాజిల్ తక్కువోడా! పుష్ప ఒకటప్పటికే అతను ఇంట గెలిచాడు. సీక్వెల్ సిద్ధమవుతున్న తరుణానికి రచ్చ కూడా గెలిచి టాప్‌గేర్‌లో ఉన్నాడు. పార్ట్ వన్‌లో దెబ్బతిన్న భన్వర్‌సింగ్ షెకావత్ రెండో భాగంలో ఎలా రెచ్చిపోతాడో చూడాలి! సిద్ధప్పనాయుడుగా రావు రమేశ్ పుష్ప పక్కనే ఉంటాడా, పరాయి పంచన చేరుతాడా అన్నది ఆసక్తికరం.
ఎందుకంటే మరో దిగ్గజం స్క్రిప్ట్‌లోకి చొరబడటమే! అదెవరో కాదు జగపతిబాబు! తాజా ట్రైలర్ ఆయన డైలాగ్‌తోనే మొదలు కావడం ఆ పాత్ర రేంజ్ చెప్పకనే చెబుతున్నది. ఇక మంగళం సీను, అతని భార్య దాక్షాయణి, పుష్ప దెబ్బకు కుదేలైన జక్కారెడ్డి ఏ ఉచ్చు పన్నుతారో తెలియదు! ప్రేమికుడిగా శ్రీవల్లిని అలరించిన పుష్ప.. పెనిమిటిగా ఎలా పెనవేసుకుంటాడో ఇంట్రెస్టింగ్ అంశం. పుష్ప తండ్రి వారసులు అతణ్ని అంతే దూరం పెడతారో, అక్కున చేర్చుకుంటారో చూడాలి! మొత్తంగా గ్రాండ్నెస్లో ఎక్కడా ‘తగ్గేదే లే’ అన్నట్టుగానే సినిమా ఉండబోతున్నదని ఇండస్ట్రీ టాక్! భారీగా పెరిగిన అంచనాలకు ఇంచు కూడా తక్కువ లేదని ట్రైలర్ చెప్పింది. వీటికితోడు పార్ట్ వన్‌లో ‘ఉహ్హూ అంటావా మామా…’ అంటూ అందరితో ఊ కొట్టించిన పాటకు దీటుగా కిస్సిక్ సాంగ్ ఎంత కిక్కు ఇస్తుందో ఈరోజు రాత్రికేతేలిపోనుంది.
ఇక పుష్ప టీజర్లో అందరినీ ఆశ్చర్యపర్చింది.. అల్లు అర్జున్ లేడీ గెటప్. సినిమాలో కథా వస్తువు ఒకటే ప్రధానం కాదు! ఆ కథ సాగుతున్న ప్రాంతానికీ అంతే ప్రాధాన్యం ఉంటుంది. శేషాచలం కొండల్లో నడిచే ఈ కథలో తిరుపతిలో జరిగే గంగమ్మ జాతరను ఇన్వాల్వ్ చేయడం దర్శకత్వ ప్రతిభే! కథనంలో మేలైన మలుపునకు ఈ జాతర వేదిక అవుతుందని విశ్లేషకుల మాట. సినిమా విడుదలయ్యాక ఆ సంగతి తెలుస్తుంది కానీ, పాలెగాన్ని సంహరించిందన్న పేరున్న గంగమ్మ సన్నిధిలో పుష్ప వీరంగం ఎవరి సంహారానికో తేలాల్సి ఉంది. పార్ట్ వన్‌లో పాత్రలు చిత్తూరు యాసతో మత్తు జల్లితే.. రెండో పార్టులో ఓ ప్రధాన పాత్ర కడప స్లాంగ్‌తో కదనానికి కాలుదువ్వినట్టు అనిపిస్తుంది. ప్రతి అంశాన్నీ కూలంకషంగా పరిశీలించే సుకుమార్ కథ జరిగే ప్రాంతాన్ని, అక్కడి వేషభాషల్ని, యాసల్ని చూపించడానికి పెద్ద కసరత్తే చేశాడేమో! పార్ట్ వన్‌కు స్ట్రాంగ్ పాయింట్‌తో ముగింపు పలికిన దర్శకుడు… రెండో పార్ట్‌ను ఎలా ఎత్తుకుంటాడన్నది చర్చనీయాంశం. దానికి ఎలాంటి ముగింపు ఇస్తాడన్నది ఆసక్తికరం.
Pushpa 3
చివరిగా…
పార్టీ లేదా పుష్ప.. అప్పుడు!
పార్టీ ఉంది పుష్ప.. ఇప్పుడు!
ఏ పార్టీ లేనప్పుడే.. ఇరగదీశాడు పుష్ప.
పార్టీ ఉందంటే.. ఇక ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు.
…? కణ్వస