Janhvi Kapoor | అలనాటి అందాల తార శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైన నటి జాన్వీ కపూర్. కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా కొత్త బాటలో పయనిస్తూ బాలీవుడ్లో మంచి అవకాశాలను దక్కించుకుంటోంది. తాజాగా ఆమె నటించిన చిత్రం ‘మిలీ’. నవంబర్ 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న జాన్వీ.. తాజగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. మిలీ కోసం తను పడిన కష్టాన్ని అభిమానులతో పంచుకుంది.
‘‘ఈ సినిమా కోసం శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా చాలా ఇబ్బంది పడ్డా. ఈ చిత్రంలో నేను మిలీ నౌదియల్గా కనిపిస్తా. దర్శకుడు సూచన మేరకు పాత్రకు సెట్ అయ్యేలా 7 కేజీలకు పైగా బరువు పెరిగా. అయితే, షూటింగ్ సమయంలో నేను పోషించిన పాత్రకు సంబంధించిన దృశ్యాలు రాత్రిపూట కలలోకి వచ్చేవి. సరిగా నిద్రకూడా పట్టేది కాదు. దీంతో ఆరోగ్యం దెబ్బతింది. రెండు, మూడు రోజులు పెయిన్ కిల్లర్ వాడా. రోజులో 15 గంటలు ఫ్రీజర్‌లో ఉండాల్సి వస్తే, అక్కడ ఓ ఎలుక మీ వేలిని కొరుకుతుంటే ఎలా ఉంటుంది. కష్టంగా ఉంది కదూ. అలాంటి నేపథ్యంలోనే ఈ చిత్రం తెరకెక్కింది. ఇది మంచి సినిమా, విజయం సాధిస్తుందనే నమ్మకం నాకు ఉంది’ అని చెప్పుకొచ్చారు.
అనుకోని పరిస్థితుల్లో మైనస్ 18 డిగ్రీల గడ్డకట్టుకుపోయే చలిలో ఇరుక్కుపోయిన మిలీ అనే యువతి ఆ ప్రమాదం నుంచి ఎలా బయటపడింది అనే ఆసక్తికర కథాంశంతో తెరకెక్కింది ఈ చిత్రం. మలయాళ చిత్రం ‘హెలెన్’కు రీమేక్‌గా ఈ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మించారు. సన్నీ కౌశల్, మనోజ్ పవా తదితరులు కీలక పాత్రలు పోషించారు. మాతృకకు దర్శకత్వం వహించిన మత్తుకుట్టి జేవియర్ ఈ సినిమాకు దర్శకుడు.