Dulquer Salmaan | మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అద్భుతమైన నటనతో మలయాళం, తమిళం, తెలుగు, హిందీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ స్టార్ నటుడు నిర్మాతగా కూడా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అతడికి సొంత నిర్మాణ సంస్థ వేఫేరర్ ఫిలిమ్స్ (Wayfarer Films) ఉంది. ఈ బ్యానర్‌పై పలు విజయవంతమైన సినిమాలు నిర్మించిన దుల్కర్‌కు ప్రస్తుతం ఊహించని షాక్ తగిలింది. ఎర్నాకుళం సౌత్ పోలీస్ స్టేషన్లో వేఫేరర్ ఫిలిమ్స్ పేరుతో తాను కాస్టింగ్ కౌచ్‌కు గురయ్యానని ఓ యువతి ఆరోపించింది. ఫిర్యాదులో, అసోసియేట్ డైరెక్టర్ దినిల్ బాబు అనే వ్యక్తి సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని చెప్పి తనను వేధించాడని పేర్కొంది.
యువతి తెలిపిన ప్రకారం దినిల్ బాబు వేఫేరర్ ఫిలిమ్స్ తరఫున మాట్లాడుతున్నానని చెప్పి, ఒక రాబోయే సినిమాకు సంబంధించిన ఆడిషన్ పేరుతో తనను పనమ్పిల్లి నగర్ సమీపంలోని ఒక భవనానికి పిలిచాడట. అక్కడ తనను గదిలోకి తీసుకెళ్లి లైంగికంగా వేధించడానికి ప్రయత్నించాడని , సహకరించకపోతే మలయాళ చిత్ర పరిశ్రమలో అవకాశాలు రాకపోవచ్చని బెదిరించాడని యువతి ఆరోపించింది. తన వద్ద ఉన్న వాయిస్ మెసేజ్‌లు, చాట్ రికార్డులను కూడా పోలీసులకు అందజేసినట్టు తెలుస్తోంది. యువతి ఫిర్యాదు మేరకు ఎర్నాకుళం సౌత్ పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటనపై వేఫేరర్ ఫిలిమ్స్ అధికారికంగా స్పందించింది. సంస్థ విడుదల చేసిన ప్రకటనలో.. దినిల్ బాబుకు తమ కంపెనీతో ఎలాంటి సంబంధం లేదని , వేఫేరర్ నిర్మించిన ఏ చిత్రంలోనూ అతను భాగం కాలేదని స్పష్టం చేసింది. అతను సంస్థ పేరును ఉపయోగించి తప్పుడు కాస్టింగ్ కాల్స్ నిర్వహించి చెడ్డపేరు తెచ్చే ప్రయత్నం చేశాడని పేర్కొంది. అంతేకాకుండా, దినిల్ బాబుపై తేవర పోలీస్ స్టేషన్ , అలాగే ఫెఫ్కా (FEFKA) వద్ద అధికారిక ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. కాస్టింగ్ కౌచ్ పేరుతో వేఫేరర్ ఫిలిమ్స్ ప్రతిష్ట దెబ్బతినకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. తమ కాస్టింగ్ కాల్స్ అధికారిక సోషల్ మీడియా పేజీల ద్వారానే జరుగుతాయని, ఇతర వ్యక్తులు లేదా నకిలీ ప్రొఫైల్స్ ద్వారా వస్తున్న ఆఫర్లను నమ్మవద్దని అభిమానులు, కళాకారులకు విజ్ఞప్తి చేసింది. దుల్కర్ సల్మాన్ ఇప్పటివరకు ఈ ఘటనపై వ్యక్తిగతంగా స్పందించలేదు కానీ, ఈ వివాదం మలయాళ సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.