ఆస్కార్ వేడుకల్లో వ్యాఖ్యాత క్రిస్ రాక్‌ను నటుడు విల్ స్మిత్ చెంపదెబ్బ కొట్టడం వివాదాస్పదమైంది. ఆస్కార్ బోర్డ్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది. ఈ నేపథ్యంలో బుధవారం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి అకాడెమీ నిబంధనల ప్రకారం అతని మీద చర్యలు తీసుకుంటామని తెలిపింది. మరోవైపు వ్యాఖ్యాత క్రిస్‌ను చెంపదెబ్బ కొట్టడం తప్పేనని ఒప్పుకొన్నారు నటుడు విల్ స్మిత్. ఆవేశంలో హద్దు మీరి ప్రవర్తించానని, అందుకు ఆస్కార్, క్రిస్ రాక్‌కు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేశారు విల్ స్మిత్. ‘గత రాత్రి నా ప్రవర్తనకు చింతిస్తున్నాను. ఆవేశంలో హద్దు మీరి ప్రవర్తించాను. నా భార్య అనారోగ్య సమస్యల మీద పరిహాసాలు చేయడం తట్టుకోలేకపోయాను. ప్రేమ నిండిన ఈ ప్రపంచంలో హింసకు తావు లేదు. ఆస్కార్ వేదికకు, క్రిస్‌కు నా క్షమాపణలు’ అని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘కింగ్ రిచర్డ్’ సినిమాలో నటనకు ఈ ఏడాది ఉత్తమ నటుడిగా ఆస్కార్ అందుకున్నారు విల్ స్మిత్.